Eknath Shinde: వంద సార్లు ఆయన పాదాలు తాకేందుకు కూడా సిద్ధమే: మహా సీఎం షిండే
- మహారాష్ట్రలో కూలిపోయిన ఛత్రపతి శివాజీ విగ్రహం
- గత ఏడాది విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- విగ్రహ నిర్మాణంలోనే కుంభకోణం జరిగిందని విపక్షాల ఆరోపణలు
మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధించే ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై ఆ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ... శివాజీ పాదాలను వందసార్లు తాకేందుకు కూడా తను సిద్ధమేనని చెప్పారు. తాను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమేనని... అవసరమైతే క్షమాపణ చెపుతానని అన్నారు. ఛత్రపతి శివాజీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. శివాజీ ఆశయాలను దృష్టిలో ఉంచుకునే తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కూలిపోయిన శివాజీ విగ్రహాన్ని పునర్నిర్మిస్తామని అన్నారు.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్ కోట్ లో గత ఏడాది శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేవీ డే సందర్భంగా ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం ఎత్తు 35 అడుగులు. ఇటీవల ఈ విగ్రహం కూలిపోవడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. విగ్రహ నిర్మాణంలోనే పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు, విగ్రహాన్ని పునర్నిర్మించేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.