Etela Rajender: తెలిసింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాత్రమే కానీ ఆ కుటుంబాల కన్నీళ్లు ఎవరికీ తెలియడం లేదు: ఈటల రాజేందర్

Etala Rajendar warning to revanth reddy over hydra demolitions

  • హస్మత్ పేట, అల్వాల్ చెరువుల వద్ద పేదలు భూములు కొనుక్కున్నారన్న ఈటల
  • ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసి ప్రచారం చేసుకున్నారని విమర్శ
  • కానీ వందలాది మంది పేదవారికి కూడా నోటీసులు ఇచ్చారని ఆగ్రహం
  • పేదల జోలికి వెళ్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక

మీకు తెలిసిందల్లా ఒక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాత్రమే... కానీ హస్మత్‌పేట, అల్వాల్, సరూర్ నగర్, సఫిల్‌గూడ చెరువుల సమీపంలో వందలాది పేద కుటుంబాల కన్నీళ్ల బాధ ఎవరికీ తెలియడం లేదని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హస్మత్‌పేట చెరువు వద్ద 125 కుటుంబాలు, అల్వాల్ చెరువు వద్ద 120 కుటుంబాలు 1985లో పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ 60 లేదా 40 గజాల భూమిని కొనుక్కున్నారన్నారు. ఈ కుటుంబాల వారు ధనవంతులు కాదని, కడు పేదవారు అన్నారు.

గతంలోనూ సీఎంలు చెరువుల అభివృద్ధి కోసం పని చేశారన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈరోజే రాష్ట్రం ఏర్పడినట్లు... వారే చెరువులను కాపాడుతున్నట్లుగా చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఏదో ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమంటే ఒకటో రెండో పెద్దవాళ్ల నిర్మాణాలు కూల్చేసి... వందల మంది పేదవారికి నోటీసులు ఇచ్చారన్నారు.

నోటీసులు రావడంతో ఇప్పుడు ఆ పేద కుటుంబాలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. వారు కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీల వద్దకు పరుగులు పెడుతున్నారన్నారు. ఇది పార్టీలకు సంబంధించిన పంచాయతీ కాదని, పేదవాళ్ల పంచాయతీ అన్నారు. హైడ్రా పేరుతో మీరు ఏం చేస్తున్నారో తనకు తెలియదని... కానీ ఇదో డ్రామా అని ముందే చెప్పాన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, గుడిసెలు కూల్చివేస్తే ఖబడ్దార్ అని గతంలోనే హెచ్చరించానని గుర్తు చేశారు.

పేదల జోలికి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి, హైడ్రా కమిషనర్ చెబుతున్నారని, కానీ పేదలకు నోటీసులు ఎందుకు ఇచ్చారో వారు చెప్పాలని నిలదీశారు. మల్కాజ్‌గిరి లోక్ సభ పరిధిలోని వందల చెరువుల కింద ఉన్న పేదల కన్నీళ్ల బాధ గురించి తాను ఇదివరకే మాట్లాడానని... ఇప్పుడు ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నానన్నారు.

ముఖ్యమంత్రి ఈరోజు సుద్దపూసలా... ధర్మాన్ని ఆయనే పునరుద్ధరిస్తున్నట్లుగా, ఛాంపియన్‌గా పోజులు కొడుతున్నారని చురక అంటించారు. పేదల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఇక్కడ నివసిస్తున్న పేదలు కేవలం రేవంత్ రెడ్డినే కాదని... అనేక మంది సీఎంలను చూశారన్నారు. అందరూ ఎన్ కన్వెన్షన్ గురించే మాట్లాడుతున్నారని... కానీ ఇన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్న పేదల గురించి ఒక్కరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల బాధను అర్థం చేసుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News