Rohit Sharma: రోహిత్ శర్మ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.50 కోట్లు రెడీగా ఉంచిందా?

Sanjiv Goenka said that All speculations are without any reason on Rohit Sharma

  • మెగా వేలంలో రోహిత్ అందుబాటులో ఉంటాడని గ్యారంటీ ఏంటన్న లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా
  • ఒక ఆటగాడి మీద 50 శాతం డబ్బు ఖర్చు పెడితే మిగతా ఆటగాళ్ల సంగతేంటని ప్రశ్న
  • కారణం లేకుండా ఊహాగాానాలు వెలువడుతున్నాయని వ్యాఖ్య

ఐపీఎల్ 2025 మెగా వేలం సందడి మొదలైంది. ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ ఇందుకు సంబంధించిన కథనాలు జోరుగా వెలువడుతున్నాయి. మెగా వేలం కారణంగా ప్రధాన జట్టులో మార్పులు చోటుచేసుకోవడం ఖాయం. దీంతో ఈసారి 10 జట్లలో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను రిటెయిన్ చేసుకుంటాయనేది క్రికెటర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రిటెయిన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ.. 5-6 మించి ఎక్కువ మంది ఆటగాళ్లకు అనుమతి ఉండకపోవచ్చునని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల అందరి దృష్టి ముంబై ఇండియన్స్ జట్టుపై పడింది. ఎందుకంటే ఆ జట్టులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీ20 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ పేసర్, టీమిండియా కీలక ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఇంతమంది సూపర్ స్టార్లలో ఎవరెవరిని ఫ్రాంచైజీ రిటెయిన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

అయితే రోహిత్ శర్మ ఆ జట్టుని వీడొచ్చని, అతడు మెగా వేలంలో అందుబాటులో ఉండొచ్చంటూ చాలా రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇక రోహిత్ శర్మను దక్కించుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఏకంగా రూ.50 కోట్లు రెడీ చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ కథనాలపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా స్పష్టత ఇచ్చారు. 

‘‘నాకో విషయం చెప్పండి. రోహిత్ శర్మ వేలానికి అందుబాటులో ఉంటున్నాడా? లేదా? అనే విషయం మీకు కానీ, ఇంకెవరికైనా గానీ తెలుసా?’’ అని సంజీవ్ గోయెంకా ప్రశ్నించారు. ఎలాంటి కారణం లేకుండానే ఈ ఊహాగానాలు వెలువడుతున్నాయని, ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను విడుదల చేస్తుందో లేదో అని ఆయన అన్నారు. ఒకవేళ రోహిత్ వేలంలో అందుబాటులో ఉన్నా ఒక జట్టు తన వద్ద ఉన్న పరిమిత డబ్బులో 50 శాతాన్ని ఒక్క ఆటగాడి మీదే ఖర్చు చేస్తే మిగిలిన 22 మంది ఆటగాళ్లను ఎలా మేనేజ్ చేసుకుంటారని సంజీవ్ గోయెంకా ప్రశ్నించారు. రోహిత్ శర్మ కోసం లక్నో జట్టు ప్రత్యేకంగా రూ.50 కోట్లు సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోందని, ఇది నిజమేనా అని ‘స్పోర్ట్స్ టాక్‌’ యాంకర్ ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.

కొంతమంది ఆటగాళ్లను తీసుకుంటే బావుంటుందనే ఉద్దేశం ఉంటుంది కదా.. ఆ జాబితాలో రోహిత్ శర్మ ఉన్నాడా అని యాంకర్ ప్రశ్నించగా సంజీవ్ గోయెంకా సూటిగా సమాధానం ఇవ్వలేదు. ప్రతి యాజమాన్యానికి ఆటగాళ్ల విష్‌లిస్ట్ ఉంటుందని, జట్టులో అత్యుత్తమ ప్లేయర్, ఉత్తమ కెప్టెన్ ఉండాలని కోరుకుంటారని అన్నారు. ప్రతి ఫ్రాంచైజీకి ఇది వస్తుందని, అయితే అందుబాటులో ఉన్న జట్టు, ఆటగాళ్లతో ఆడాల్సి ఉంటుందని ఆయన సమాధానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News