joy alukkas: జాయ్ అలుక్కాస్ ను చీదరించుకున్న కారు షోరూం సిబ్బంది!

billionaire joy alukkas was insulted turned away from a rolls royce dealership in dubai

  • రోల్స్ రాయిస్ కారు చూసేందుకు వెళితే షోరూమ్ సిబ్బంది అవమానకరంగా మాట్లాడారన్న జాయ్ అలుక్కాస్ 
  • పట్టుదలతో ఆ కారు కొనాలని నిర్ణయించుకుని కొనుగోలు చేసినట్లు వెల్లడి
  • అదే కారును ప్రచార సాధనంగా వాడుకొని పశ్చిమాసియాలోనే ఫేమస్‌ అయింది జాయాలుక్కాస్  

జోయాలుక్కాస్ అంటే పెద్దగా తెలియని వారు ఎవరూ ఉండరు. ఇది ఒక బ్రాండ్. పేరుగాంచిన నగల దుకాణాల్లో జోయాలుక్కాస్ ఒకటి. జాయ్ అలుక్కాస్ గ్రూపునకు విదేశాల్లో 60, భారత్ లో వందకు పైగా నగల దుకాణాలు ఉన్నాయి. అయితే ఇంతటి ధనవంతుడైన జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్ గతంలో ఓ చేదు అనుభవాన్ని చవి చూశారు. సాధారణంగా ఎవరైనా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే ఎదురుదెబ్బలు, అవమానాలు, చీదరింపులు, ఛీత్కారాలు ఏదో ఓ సందర్భంలో ఎదుర్కోవాల్సిందే. ఇటువంటి వాటిని స్పూర్తిగా తీసుకుని శ్రమించి ముందుకు అడుగులు వేసి ఉన్నత స్థాయికి చేరిన వాళ్లు అరుదుగా ఉంటారు. అటువంటి కోవలోకి జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ కూడా వస్తారు. 
 
జాయ్ అలుక్కాస్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఇటీవల వెల్లడించారు. సీఎన్బీసీ – 18 అనే ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవాన్ని వివరిస్తూ, అది తన జీవితంలో మరచిపోలేనిదని చెప్పుకొచ్చారు.  2000వ సంవత్సరంలో తను రోల్స్ రాయిస్ కారు చూడాలనిపించి షోరూమ్ కు వెళ్లగా, వినియోగదారులను మర్యాదగా ఆహ్వానించాల్సిన సిబ్బంది తన పట్ల అమర్యాదగా మాట్లాడారన్నారు. ‘నువ్వు కారు కొనాలనుకుంటున్నావా? అయితే నీకు కావాల్సిన కారు ఈ షోరూమ్ లో ఉండదు. వేరే షో రూమ్ కు వెళ్లు’ అని అన్నారని చెప్పారు. 

వారి ప్రవర్తన తనకు బాధకల్గించిందని, దాంతో ఎలాగైనా అదే కారు కొనాలని అప్పుడే నిర్ణయించుకుని చివరకు సాధించానని చెప్పుకొచ్చారు. అయితే కారు కొనుగోలు చేసిన తర్వాత ఇంతటి లగ్జరీ అవసరం లేదని భావించానని, దాంతో దుబాయిలో వేగంగా విస్తరిస్తున్న తన అభరణాల వ్యాపారానికి ప్రచార సాధనంగా ఈ కారును వినియోగించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆ క్రమంలో తన స్టోర్స్ నిర్వహించే వార్షిక డ్రాలో విజేతగా నిలిచిన వారికి ఆ కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రకటన నాడు తీవ్ర సంచలనమైంది. దీంతో జాయాలుక్కాస్ ఫేమస్ అయ్యింది. పశ్చిమ ఆసియాలో ప్రముఖ బంగారు ఆభరణాల రిటైలర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

  • Loading...

More Telugu News