Raja Singh: రేవంత్ రెడ్డీ... ఒవైసీ సోదరులకు భయపడకుండా దానిని కూల్చెయ్: సీఎంకు రాజాసింగ్ మద్దతు

Raja Singh support Revanth Reddy over HYDRA

  • ఒవైసీ సోదరులు చెరువును ఆక్రమించి ఫాతిమా కాలేజీని అక్రమంగా నిర్మించారన్న రాజాసింగ్
  • కిరణ్ కుమార్ రెడ్డిలాగే భయపడకుండా ముందుకెళ్లాలని సూచన
  • అసదుద్దీన్ ఒవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందన్న రాజాసింగ్

ఒవైసీ సోదరులు ఫాతిమా కాలేజీని చెరువులో అక్రమంగా నిర్మించారని, వారి బెదిరింపులకు భయపడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు పలికారు. చెరువులు, కుంటలను ఆక్రమించి జరిగిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఇదే సమయంలో ఒవైసీ సోదరులకు చెందిన ఫాతిమా కాలేజీపై కూడా ఆరోపణలు వచ్చాయి. చెరువును ఆక్రమించి నిర్మించిన ఈ కాలేజీని కూల్చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు, ఫిర్యాదులు వచ్చాయి.

దీంతో అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. కావాలంటే తనపై మరోసారి బుల్లెట్ల వర్షం కురిపించవచ్చునన్నారు. కానీ ఆ స్కూల్‌ను మాత్రం కూల్చవద్దని విజ్ఞప్తి చేశారు. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 భవనాలు నిర్మించామని, వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించుకోవచ్చునన్నారు. అవసరమైతే తనపై కత్తులతో దాడి చేయండి... కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండన్నారు.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. చెరువులను కాపాడాలని ముఖ్యమంత్రి సంకల్పం తీసుకోవటం అభినందనీయమని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని సూచించారు. వేలమంది యువత భవిత అంటూ బెదిరిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగానే... భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళాలని సూచించారు.

ఒవైసీని అరెస్ట్ చేసి జైల్లో వేయించిన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరుందని తెలిపారు. ఉచిత విద్య పేరుతో ఓవైసీ సోదరులు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. చెరువులో 12 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజీని నిర్మించారని మండిపడ్డారు.

అసదుద్దీన్ ఒవైసీ బంగ్లా కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందన్నారు. ఆ భవనంపై విచారణ జరిపి బుల్డోజర్లతో కూల్చాలని కోరారు. రేవంత్ రెడ్డిని ఒవైసీ సోదరులు భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి గులాంగిరి చేసిందని విమర్శించారు. 

  • Loading...

More Telugu News