Assam: అత్యాచారం అంటే ఏంటని అత్తను అడిగిన బాలిక.. రెండ్రోజుల తర్వాత ఆమెపైనే సామూహిక అత్యాచారం

Assam girl asked aunt what assault is 2 days before she was assaulted

  • అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ నెల 22న ఘటన
  • కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన వార్తలు చూసి లైంగిక దాడి అంటే ఏంటని ప్రశ్న
  • ఆ తర్వాత రెండు రోజులకే ట్యూషన్ నుంచి వస్తుండగా యువకుల అఘాయిత్యం
  • పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులో దూకి ప్రధాన నిందితుడి మృతి

అత్యాచారం అంటే ఏంటని తన అత్తయ్యను అడిగిన బాలిక ఆ తర్వాత రెండు రోజుల్లోనే సామూహిక లైంగికదాడికి గురైంది. అస్సాంలోని నాగావ్‌ జిల్లాలో ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకేసుకు సంబంధించిన వార్తలను రోజూ చూస్తున్న బాలిక.. అసలు అత్యాచారం అంటే ఏంటని తన అత్తను ప్రశ్నించింది. 

ఆ తర్వాత రెండు రోజులకే 22న ట్యూషన్ నుంచి ఇంటికొస్తున్న బాలికను అడ్డగించిన కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారకస్థితిలో పడి ఉన్న బాలికను చూసిన స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. మేనత్త ఇంట్లో ఉంటున్న బాలిక సాధారణంగా రిక్షాలో కానీ, లేదంటే అత్తయ్యతో కానీ ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుంది. ఘటన జరిగిన రోజున మాత్రం సైకిలుపై వస్తూ లైంగిక దాడికి గురైంది. 

ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందని బాలిక అత్త పేర్కొన్నారు. ఆమెను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యానంటూ కన్నీరు పెట్టుకుంది. బాలికకు డీఎస్పీ కావాలని కోరికగా ఉండేదని, ఒకసారి డీఎస్పీని కలిసి మాట్లాడిందని ఆమె గుర్తు చేసుకున్నారు. 

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బాధిత బాలికకు న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన తఫాజుల్ ఇస్లాం పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులోకి దూకి మృతి చెందాడు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News