Emily Lahey: చికిత్స లేని కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం!

Emily Lahey Who is suffering from terminal cancer is auctioning her last moments

  • 27 ఏళ్ల వయసులో అత్యంత అరుదైన ‘ఎన్‌యూటీ కార్సినోమా’ కేన్సర్ బారినపడిన యువతి
  • 9 నెలలకు మించి బతకదన్న వైద్యులు
  • అమెరికాలో కటింగ్ ఎడ్జ్ చికిత్స తీసుకున్న తర్వాత మరో మూడేళ్లు పెరిగిన జీవితకాలం
  • మూడు నిమిషాల చొప్పున చివరి క్షణాలను వేలం వేయనున్న యువతి
  • తద్వారా వచ్చిన నిధులను క్యాన్సర్‌పై పరిశోధన, అవగాహన కోసం వినియోగం

అత్యంత అరుదైన, చికిత్స లేని క్యాన్సర్‌తో బాధపడున్న ఆస్ట్రేలియా యువతి జీవితంలోని తన చివరి క్షణాలను వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా వచ్చే డబ్బును కేన్సర్‌పై పరిశోధనతోపాటు అవగాహన పెంపొందించేందుకు వినియోగిస్తారు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆమె పేరు ఎమిలీ లాహే. వయసు 32 సంవత్సరాలు. 2019లో 27 ఏళ్ల వయసులో ‘ఎన్‌యూటీ కార్సినోమా’ అనే క్యాన్సర్‌ బారినపడింది. 9 నెలలకు మించి బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చేశారు. అయితే,  అమెరికాలో కటింగ్ ఎడ్జ్ చికిత్స తీసుకున్న తర్వాత ఆమె జీవితకాలం మరో మూడేళ్లు పెరిగింది. ఈ చికిత్స ఆస్ట్రేలియాలో లేదు.

క్షణక్షణానికి చావుకు దగ్గరవుతున్న లాహే జీవితంలో అత్యంత విలువైన చివరి క్షణాలను మూడు నిమిషాల చొప్పున వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆమె చివరి క్షణాలను దక్కించుకున్న వారికి లాహేతో కలిసి మూడు నిమిషాలు గడిపే అవకాశం కల్పిస్తారు. ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న వారితో గడపడం ద్వారా జీవితంలో వారు అనుభవిస్తున్న భావోద్వేగ, మానసిక ప్రభావాన్ని గుర్తించే వీలుకలుగుతుంది. 

ఒకరి తర్వాత ఒకరిగా ఇలా 30 మందికి అనుమతిస్తారు. కరిగిపోతున్న క్షణాలను వారితో పంచుకునే క్రమంలో ఓ ప్రొజెక్టర్‌లో మూడు నిమిషాల సమయాన్ని కౌంట్‌డౌన్‌లో ప్రదర్శిస్తారు. ఈ వేలం ద్వారా ప్రజలు తమ జీవితాన్ని భిన్నమైన దృక్కోణంలో చూసే అవకాశం లభిస్తుందని లాహే చెప్పుకొచ్చింది. వర్తమానంలో జీవించాలని, ఎందుకంటే జీవితాన్ని కొనలేమని, సేవ్ చేయలేమని, అది ఒకసారి పోయిందంటే, పోయినట్టేనని వివరించింది.

  • Loading...

More Telugu News