Rohit Sharma: ఐపీఎల్ వేలంలో రోహిత్ శర్మను దక్కించుకుంటారా?.. అన్నదానికి క్లారిటీ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ డైరెక్టర్

It all depends on whether we have the money in our pockets says PBKS Sanjay Bangar on Rohit Sharma

  • ఫ్రాంచైజీ ఖజనాలో సొమ్ము ఆధారంగా హిట్‌మ్యాన్‌ను దక్కించుకోవడం ఆధారపడి ఉందన్న సంజయ్ బంగర్
  • రోహిత్ వేలంలో ఉంటే కచ్చితంగా భారీ ధర పలుకుతాడన్న పంజాబ్ కింగ్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్
  • ఈ ఏడాది మెగా వేలంలో రోహిత్ పేరు ఉండడం ఖాయమంటూ జోరుగా వెలువడుతున్న కథనాలు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో చాలా మంది టాప్ క్రికెటర్లు అందుబాటులో ఉండొచ్చని, వారిని కొత్త ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరు కూడా ఈ జాబితాలో గట్టిగానే వినిపిస్తోంది. ఫ్రాంచైజీలు ఆరుగురి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకోవడానికి వీల్లేదంటూ బీసీసీఐ నిబంధన విధించడం, 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించిన నేపథ్యంలో రోహిత్ శర్మ పేరు వేలం జాబితాలో ఉండడం ఖాయమని క్రికెట్ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

రోహిత్ శర్మకు బ్రాండ్ వ్యాల్యూ ఉండడంతో వేలంలో అందుబాటులో ఉంటే ఫ్రాంచైజీలు అతడి కోసం ఎగబడే అవకాశాలు ఉన్నాయి. హిట్‌మ్యాన్‌ను దక్కించుకోవాలని భావిస్తున్న ఫ్రాంచైజీలలో పంజాబ్ కింగ్స్ కూడా ఉంది. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని ఈ జట్టు వీలైతే రోహిత్‌ను దక్కించుకోవాలని యోచిస్తోంది. కొన్నాళ్లుగా వెలువడుతున్న ఈ ఊహాగానాలపై పంజాబ్ కింగ్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ సంజయ్ బంగర్ స్పందించారు. రోహిత్‌ను దక్కించుకోవడంపై ఆసక్తిని ప్రదర్శించిన ఆయన.. ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు మిగిలి ఉందనేదానిపై హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేయడం ఆధారపడి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రోహిత్ వేలంలో అందుబాటులో ఉంటే అతడు అధిక ధరకు అమ్ముడు పోతాడని తాను కచ్చితంగా నమ్ముతున్నానని అన్నారు. రావు పోడ్‌కాస్ట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాగా ఐపీఎల్ గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఇటీవలే అతడు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో కొత్త కెప్టెన్‌ను అన్వేషించడం పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి అనివార్యమైంది. దీంతో రోహిత్ శర్మపై పంజాబ్ కింగ్స్ కన్నేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

కాగా ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తొలగించింది.  హిట్‌మ్యాన్ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించిన నాటి నుంచి రోహిత్ చుట్టూ అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఏకంగా నాలుగు టైటిల్స్ అందించిన కెప్టెన్‌ను పక్కన పెట్టారంటూ రోహిత్ ఫ్యాన్స్ మండిపడ్డారు. హార్ధిక్ పాండ్యాతో పాటు ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై విమర్శల దాడి చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News