Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ నుంచి ఫోన్

PM Narendra Modi spoke to US President Joe Biden on phone over Ukraine Russia conflict

  • ఉక్రెయిన్-రష్యా యుద్ధం, బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్న ఇరు దేశాధినేతలు
  • శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారత్ సంపూర్ణ సహకారం ఇస్తుందన్న ప్రధాని
  • ప్రధాని మోదీ ఇటీవలే ఉక్రెయిన్‌లో పర్యటించిన నేపథ్యంలో బైడెన్ ఫోన్
  • బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపైనా ఇరువురి మధ్య చర్చ

ఉక్రెయిన్-రష్యా యుద్ధం, బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చించారు. ఈ మేరకు సోమవారం ఇరువురు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఇటీవలే పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన నేపథ్యంలో మోదీకి బైడెన్ ఫోన్ చేశారు.

మోదీ, బైడెన్ ఏం చర్చించారంటే..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘ఇవాళ ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మాట్లాడాను. ఉక్రెయిన్‌లో పరిస్థితితో పాటు వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై వివరణాత్మక అభిప్రాయాలను పంచుకున్నాం. శాంతి, స్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నేను పునరుద్ఘాటించాను. బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై కూడా చర్చించాం. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రతపై మేము చర్చించుకున్నాం. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాం’’ అని మోదీ వివరించారు.

ఉక్రెయిన్‌లో పరిస్థితిని వివరించిన మోదీ..
ఉక్రెయిన్‌లో పరిస్థితిపై చర్చల సమయంలో బైడెన్‌కు ప్రధాని మోదీ వివరించారని అధికారులు వెల్లడించారు. చర్చలు, దౌత్య మార్గంలో సమస్య పరిష్కరించుకోవాలనే వైఖరికి భారత్ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారత్ మద్దతిస్తుందని, క్వాడ్‌తో పాటు వివిధ వేదికల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉండాలని ఇరువురు నేతలు నిర్ణయించారని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News