Shivaji statue: మహారాష్ట్రలో కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

Shivaji statue unveiled collapses in Maharashtra
  • గత ఏడాది విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
  • రెండు మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలు
  • విగ్రహం ఏర్పాటులో నాణ్యతను పట్టించుకోలేదని ప్రతిపక్షాల విమర్శ
రెండు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింధు దుర్గ్ జిల్లాలోని రాజ్ కోట్‌ కోట వద్ద ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం కుప్పకూలింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 

నేవీ డే సందర్భంగా గత ఏడాది ప్రధాని నరేంద్రమోదీ దీనిని ఆవిష్కరించారు. అయితే రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విగ్రహం కుప్పకూలింది.

విషయం తెలియగానే పోలీసులు, జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను రంగంలోకి దింపారు. ఈ విగ్రహం కూలిపోయిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి ఆలోచించింది తప్ప, నాణ్యత గురించి చూడలేదని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంత్ పాటిల్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భారీ నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు వేసి దాని ప్రకారం కమీషన్లు ఇస్తోందని ఆరోపించారు.

ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని శివసేన (యూబీటీ) మండిపడింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దీపక్ కేసర్కర్ పేర్కొన్నారు.
Shivaji statue
Maharashtra
BJP

More Telugu News