Stock Market: నేడు కళకళలాడిన స్టాక్ మార్కెట్ సూచీలు
- వడ్డీ రేట్ల తగ్గింపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ సానుకూల వ్యాఖ్యలు
- లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కొనుగోళ్ల జోరు
సెప్టెంబరులో శుభవార్త వింటారన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో వడ్డీ రేట్ల తగ్గింపుపై భారీ అంచనాలు వెలువడిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్ నేడు కళకళలాడింది. సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ ట్రేడింగ్ ఆరంభం నుంచే దూసుకుపోయాయి.
సాయంత్రానికి సెన్సెక్స్ 611 పాయింట్ల వృద్ధితో 81,698 వద్ద ముగియగా... నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 25,010 వద్ద స్థిరపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కొనుగోళ్ల సందడి కనిపించింది.
ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, మెటల్, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంకులు, మౌలిక సదుపాయాల రంగం షేర్లు లాభాల బాటలో పయనించాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, మీడియా కంపెనీల షేర్లకు ప్రతికూల వాతావరణం ఎదురైంది.
హెచ్ సీఎల్ టెక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటాన్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలు అందుకోగా... మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా, నెస్లే, సన్ ఫార్మా, హెచ్ యూఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లకు నష్టాలు తప్పలేదు.