Flipkart Minutes: ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌ను ఆశ్చర్యపరిచిన ఫ్లిప్‌కార్ట్

Bengaluru resident received a laptop with in 13 minutes record time by Flipkart Minutes

  • కేవలం 13 నిమిషాల్లోనే ప్రొడక్ట్‌ డెలివరీ చేసిన ఈ-కామర్స్ దిగ్గజం
  • బెంగళూరు కస్టమర్‌కు ఆశ్చర్యపోయే అనుభూతి
  • ప్రత్యర్థి కంపెనీలకు పోటీగా త్వరగా డెలివరీలు అందించేందుకు ఇటీవలే ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ ప్రారంభం

ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ ఇచ్చిన ఓ కస్టమర్‌ను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆశ్చర్యపరిచింది. మెరుపు వేగంతో ల్యాప్ టాప్ అందించి అబ్బురపరిచింది. ఆర్డర్ చేసిన 13 నిమిషాల్లోనే డెలివరీని అందించింది. బెంగళూరు నగరానికి చెందిన ఓ కస్టమర్‌కు రికార్డు కనిష్ఠ సమయంలో ఈ ఉత్పత్తిని అందించింది. వీలైనంత త్వరగా ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఇటీవల ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ ద్వారా ఈ స్పీడ్ డెలివరీ సాధ్యమైంది. 

ఆర్డర్ ఇచ్చిన 13 నిమిషాల్లోనే డెలివరీని అందుకున్న వినియోగదారుడు సన్నీ గుప్తా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘‘ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌పై ల్యాప్‌టాప్‌ ఆర్డర్ చేశాను. 7 నిమిషాల్లో డెలివరీ కోసం ఆర్డర్ చేశాను. అయితే ట్రాకింగ్ పేజీలో డెలివరీ కొద్దిగా ఆలస్యం అవుతుందని చూపించింది. డెలివరీకి 12 నిమిషాల సమయం పడుతుందని అప్‌డేట్ ఇచ్చింది. చెల్లింపు సమయం నుంచి దానిని స్వీకరించడానికి సరిగ్గా 13 నిమిషాల సమయం పట్టింది’’ అని గుప్తా పేర్కొన్నాడు. ఈ మేరకు ఆగస్టు 22న అతడు పెట్టిన ఎక్స్ పోస్టు వైరల్‌గా మారింది.

"ఏసర్ ప్రిడేటర్ (Acer Predator) ల్యాప్‌టాప్ కోసం ఆన్‌లైన్ లో ఆర్డర్ చేశాను. సాధారణంగా దీని రేటు రూ.95,000 నుంచి రూ.2.5 లక్షల మధ్య ఉంటుంది. కొన్ని నెలలుగా ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నాను. ఇవాళ నేను నా షార్ట్‌లిస్ట్‌ను పరిశీలిస్తుండగా 15 నిమిషాల్లో ల్యాప్‌టాప్ పొందే అవకాశం కనిపించింది’’ అని గుప్తా వివరించాడు. 

కాగా గుప్తా ట్వీట్ కు భారీ స్పందన వస్తోంది. ఇది కొత్త భారతదేశం అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. 7 నిమిషాల్లోనే ల్యాప్‌టాప్ డెలివరీ అవ్వాలని ఎవరూ కోరుకోరు... కానీ భారతీయ ఈ-కామర్స్ రంగం వృద్ధి  చెందుతుండడం సంతోషం కలిగిస్తోందని వ్యాఖ్యానించాడు.

కాగా బెంగళూరు నగరంలో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఇప్పటికే వేగంగా డెలివరీలు చేస్తున్నాయి. దీంతో ప్రత్యర్థులతో పోటీ పడేందుకు ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే కొన్ని బెంగళూరు పరిసరాల్లో ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ సర్వీసును ప్రారంభించింది.

  • Loading...

More Telugu News