Bangladesh: పాకిస్థాన్‌ జట్టుకు అవమానం... సరికొత్త చరిత్ర లిఖించిన బంగ్లాదేశ్

Bangladesh rewrote the history books on Sunday as they registered their first ever win over Pakistan in Test cricket

  • రావల్పిండి టెస్టులో విజయం సాధించిన బంగ్లాదేశ్
  • పాక్‌పై బంగ్లాకు తొలి టెస్ట్ విజయం
  • 191 పరుగుల భారీ స్కోరుతో విజయంలో కీలక పాత్ర పోషించిన ముష్ఫికర్ రహీమ్

బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ సరికొత్త చరిత్ర లిఖించింది. పాకిస్థాన్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి పెను సంచలనాన్ని నమోదు చేసింది. ఆదివారం ముగిసిన రావల్పిండి టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది. మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఏకంగా 8 గంటలపాటు క్రీజులో నిలిచి పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు 191 పరుగులు సాధించడం ఈ విజయానికి బాటలు వేసింది.

నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసిన పాకిస్థాన్‌.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లను తక్కువ అంచనా వేసి డిక్లేర్ నిర్ణయం తీసుకున్న పాక్‌కు బిగ్ షాక్ తగిలింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 565 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. 

ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ అనూహ్యంగా 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 30 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండా బంగ్లాదేశ్ ఓపెనర్లు ఛేదించారు. దీంతో బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయాన్ని సాధించినట్టైంది. 191 పరుగులతో రాణించిన బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫీకర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

అదరగొట్టి ముష్పికర్...

191 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో విదేశీ గడ్డపై బంగ్లాదేశ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు (5) సాధించిన బ్యాటర్‌గా, విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు సాధించిన బంగ్లా బ్యాటర్‌గా ముష్ఫీకర్ రహీమ్ నిలిచాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 341 బంతులు ఎదుర్కొన్న అతడు 22 ఫోర్లు బాదాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వికెట్ కీపర్-బ్యాటర్ లిట్టన్ దాస్‌తో 114 పరుగులు, మెహిదీతో కలిసి ఏడవ వికెట్‌కు 196 పరుగుల భాగస్వామ్యాలను ముష్పికర్ నెలకొల్పాడు.

స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోవడం అవమానకరమంటూ ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు హింసాత్మక అల్లర్ల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బంగ్లాదేశ్ వాసులకు ఈ విజయం కాస్త ఉపశమనం కల్పించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News