Telegram: అరెస్ట్ వారెంట్ ఉన్నా ఫ్రాన్స్‌లో అడుగుపెట్టి అరెస్ట్ అయిన టెలిగ్రామ్ సీఈవో

Telegram Chief Pavel Durov arrested at French airport

  • 39 ఏళ్ల పావెల్‌పై మోసం, సైబర్ నేరాలు వంటి అభియోగాలు
  • ఇప్పటికే ఆయనపై అరెస్ట్ వారెంట్
  • అరెస్ట్‌పై ఇప్పటి వరకు స్పందించని టెలిగ్రామ్ 

పాప్యులర్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ అరెస్టయ్యారు. తన ప్రైవేటు జెట్‌లో అజర్ బైజాన్ నుంచి పారిస్‌లోని లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను గత రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 ఏళ్ల ఈ బిలియనీర్‌ను నేడు కోర్టులో హాజరు పరచనున్నారు.

రష్యాలో పుట్టిన పావెల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయనకు ఫ్రాన్స్, యూఏఈ పౌరసత్వాలు ఉన్నాయి. కాగా, ఆయనపై మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడం వంటి అభియోగాలున్నాయి. ఆయనపై గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ కాగా, తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

తనపై అరెస్ట్ వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ పారిస్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పావెల్ అరెస్ట్‌పై టెలిగ్రాం ఇప్పటి వరకు స్పందించలేదు. 15.5 బిలియన్ డాలర్ల సంపద కలిగిన దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు. ఆయన తన సోదరుడు నికోలాయ్‌తో కలిసి 2013లో టెలిగ్రామ్‌ యాప్‌ను తీసుకొచ్చారు. దీనికిప్పుడు ప్రపంచవ్యాప్తంగా 900 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 

More Telugu News