HYDRA: హైడ్రాకు చట్టబద్ధత ఉందా?... కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే...!

HYDRA Commissioner explains executive power

  • ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు... హైడ్రా
  • జీవో నెం.99 ద్వారా హైడ్రా ఏర్పడిందన్న కమిషనర్ రంగనాథ్
  • జీవోల ద్వారా ఏర్పడే సంస్థలకు చట్టబద్ధత ఉంటుందని స్పష్టీకరణ
  • గతంలో ఏసీబీ కూడా ఇలాగే జీవో ద్వారా ఏర్పడిందని వెల్లడి

ఇటీవల హైదరాబాదులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి సంక్షిప్త రూపమే... హైడ్రా. ఇవాళ హైదరాబాదులో స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంతో హైడ్రా పేరు మార్మోగిపోతోంది. 

ఈ నేపథ్యంలో... హైడ్రాకు చట్టబద్ధత ఉందా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. 

"హైడ్రా అనేది ఒక కార్యనిర్వాహక వ్యవస్థ. ఇది జీవో నెం.99 ద్వారా ఏర్పడింది. జులై 19న ఇది జీవో వచ్చింది. జీవోలకు సహజంగానే చట్టబద్ధత ఉంటుంది. గతంలో ఇదే విధంగా 1985లో ఒక జీవో ద్వారా ఏసీబీ ఏర్పడింది. అదే విధంగా జీవో ద్వారా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వ్యవస్థ కూడా ఏర్పడింది. 

ఇలా జీవో ద్వారా ఏర్పడిన సంస్థలకు రాజ్యాంగ పరంగా కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. గతంలో ప్లానింగ్ కమిషన్, లా కమిషన్ కూడా ఇలాగే కార్యనిర్వాహక ఆదేశాలతో ఏర్పడ్డాయి. జీవోల ద్వారా ఏర్పడిన వ్యవస్థలకు చట్టబద్ధత ఉండదు అనడానికి లేదు. 

ఆక్రమణల తొలగింపు అనేది స్థానిక సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలన్నది హైడ్రా జీవోలోనే ఉంది. ఆ ప్రకారమే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నాం" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News