Jagan: చంద్రబాబు ప్రెస్ మీట్ బాధను కలిగించింది: జగన్
- అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్
- ప్రమాదం పగలు జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శ
- పరిహారం ఇవ్వకపోతే ధర్నా చేస్తానని హెచ్చరిక
అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ ఉదయం అనకాపల్లికి వెళ్లిన జగన్... ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ... అచ్యుతాపురం ఘటన బాధాకరమని చెప్పారు. ఫార్మా కంపెనీలో పట్టపగలు ప్రమాదం జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కార్మికశాఖ మంత్రి దగ్గర కూడా వివరాలు లేవని అన్నారు. ప్రమాదంలో ఎంత మంది చనిపోయారో తెలియదని చెప్పారు.
బాధితులకు, మృతుల కుటుంబాలకు పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పారు.
సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ తనకు బాధను కలిగించిందని జగన్ అన్నారు. ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని చెప్పారు. వీరి దృష్టి మొత్తం రెడ్ బుక్ పైనే ఉందని అన్నారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు.