Dinesh Karthik: ధోనీ అభిమానుల‌కు సారీ చెప్పిన దినేశ్ కార్తీక్‌!

Dinesh Karthik Apologises MS Dhoni Fans

  • తన ఆల్ టైమ్ ఇండియా ఎలెవన్ జ‌ట్టులో ధోనీకి చోటివ్వ‌ని డీకే
  • తాజాగా త‌న త‌ప్పును తెలుసుకుని మ‌హీ ఫ్యాన్స్‌కు క్ష‌మాప‌ణ‌లు
  • ధోనీని తన జ‌ట్టులో నంబ‌ర్ 7 ప్లేయ‌ర్‌గా, సార‌థిగా రిప్లేస్ చేస్తాన‌న్న దినేశ్ కార్తీక్

తన ఆల్ టైమ్ ఇండియా ఎలెవన్ జ‌ట్టులో లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చోటు ఇవ్వ‌కుండా నిరాశపరిచిన మ‌హీ అభిమానులకు భారత మాజీ క్రికెట‌ర్ దినేశ్‌ కార్తీక్ క్షమాపణలు చెప్పాడు.

ఇక కార్తీక్ తన ఆల్ టైమ్ ఇండియా ప్లేయింగ్ XIని ప్ర‌క‌టించ‌డం, అందులో ధోనీ పేరును ప్రస్తావించని విషయం తెలిసిందే. దాంతో ధోనీని జట్టులోకి తీసుకోనందుకు అత‌నిపై విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే, క్రిక్‌బజ్‌తో తన తాజా షోలో ఈ విష‌య‌మై కార్తీక్ స్పందించాడు. ఆల్ టైమ్ ఇండియా ఎలెవన్  లైనప్ నుండి మాజీ కెప్టెన్‌ను త‌ప్పించ‌డంపై ఏమి జరిగిందో వివరించాడు. జట్టును ఎంపిక చేసే క్ర‌మంలో వికెట్ కీపర్‌ను ఎంచుకోవడం మరచిపోయానని పేర్కొన్నాడు. అయితే, తాను ప్ర‌క‌టించిన జ‌ట్టులో రాహుల్ ద్రవిడ్ ఉండ‌డంతో వికెట్ కీపర్‌గా అత‌డిని ఎంచుకున్నాన‌ని చాలా మంది అనుకున్నారని చెప్పుకొచ్చాడు. 

ఇంకా మాట్లాడుతూ.. "బ్ర‌ద‌ర్‌ నేను చాలా పెద్ద త‌ప్పు చేశాను. ఆ వీడియో రిలీజ‌య్యాకే ఆ టీమ్‌లో వికెట్ కీప‌ర్ లేడ‌ని గుర్తించాను. అదృష్టవశాత్తూ రాహుల్ ద్రవిడ్ అక్కడ ఉన్నాడు. దాంతో నేను ఒక పార్ట్‌టైమ్ వికెట్ కీపర్‌తో వెళుతున్నానని అందరూ అనుకున్నారు. కానీ, ధోనీ ఏ జ‌ట్టులోనైనా ఉండాల్సిన ఆట‌గాడు. గొప్ప కెప్టెన్‌. అతడిని నా జ‌ట్టులో నంబ‌ర్ 7 ప్లేయ‌ర్‌గా, సార‌థిగా రిప్లేస్ చేస్తా" అని క్రిక్‌బజ్ వీడియోలో పేర్కొన్నారు. 

దినేశ్‌ కార్తీక్ ఆల్ టైమ్ ఇండియా ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, ఆర్ అశ్విన్, జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, హర్భజన్ సింగ్ (12వ ఆట‌గాడు).

  • Loading...

More Telugu News