Woman: ఎన్‌క్లోజర్ ఎక్కి పులితో పరాచికాలు... తృటిలో తప్పించుకున్న మహిళ

US Woman Climbs Into Tiger Enclosure In Zoo Nearly Gets Bitten

  • పులిని చేతితో తాకేందుకు ప్రయత్నించిన మహిళ
  • పులి దాడి చేసే ప్రయత్నం చేయగా వేగంగా వెనక్కి వచ్చిన మహిళ
  • న్యూజెర్సీలోని కోహన్‌జిక్ జూలో ఘటన

అమెరికా న్యూజెర్సీలోని కోహన్‌జిక్ జూలో గత ఆదివారం మధ్యాహ్నం షాకింగ్ సంఘటన జరిగింది. ఓ మహిళ జూలోని బెంగాల్ టైగర్ ఎన్‌క్లోజర్‌ ఫెన్సింగ్ పైకి ఎక్కింది. ఇది గమనించిన ఆ పులి ఆమెపై దాడి చేయబోయింది. ఆమె చేయిని కొరికే ప్రయత్నం చేసింది. కానీ ఆమె వేగంగా అక్కడి నుంచి వెనక్కి తప్పుకుంది. దీంతో ప్రమాదం తప్పింది.  ఈ దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

బ్రిడ్జ్‌టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, సదరు మహిళ చేతితో పులిని తాకేందుకు ప్రయత్నం చేసింది. ఈ సమయంలో ఆ పులి ఆమెపై దాడి చేసేందుకు సిద్ధమైంది. పులి తీరును గమనించిన ఆమె వెంటనే ఎన్ క్లోజర్ నుంచి వెనక్కి వచ్చేసింది. 

కాగా, ఆమె ముదురు రంగు టాప్, తెల్లటి టీషర్ట్ ధరించింది. ఎన్‌క్లోజర్ సమీపంలో ఫెన్సింగ్ పైకి ఎక్కవద్దు... అలా ఎక్కడం సిటీ ఆర్డినెన్స్ 247-సీకి విరుద్ధమని హెచ్చరిక బోర్డ్ రాసి ఉన్నప్పటికీ ఆమె లెక్కచేయలేదు. 

జూ వెబ్ సైట్ ప్రకారం అందులో రెండు బెంగాల్ పులులు ఉన్నాయి. వీటి పేర్లు రిషి, మహేశా. 2016లో ఈ జూకు పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చాయి. అప్పుడు కేవలం 20 పౌండ్ల బరువు ఉన్న పులులు ఇప్పుడు 500 పౌండ్ల బరువును కలిగి ఉన్నాయని వెబ్ సైట్‌లో పేర్కొంది.

More Telugu News