KTR: రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సమాధానం రాలేదు: కేటీఆర్

KTR fires at Revanth Reddy in Dharna

  • కొండారెడ్డిపల్లిలో 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరానన్న కేటీఆర్
  • ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్
  • ఆరు గ్యారెంటీలు, హామీలపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే సత్తా లేదని విమర్శ

తన సొంతూరు కొండారెడ్డిపల్లెలో 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సమాధానం రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే రూ.49 వేల కోట్లు అవసరమని బ్యాంకర్లు... ముఖ్యమంత్రికి చెప్పారని, ఆ తర్వాత మంత్రివర్గంలోనూ రూ.31 వేల కోట్లకు తీర్మానం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా రుణమాఫీకి రూ.26 వేల కోట్లు కేటాయించారన్నారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ వంద శాతం రుణమాఫీ చేశామని చెప్పడం విడ్డూరమన్నారు. ఆరు గ్యారెంటీలు, ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే సత్తా లేదని విమర్శించారు. శాసనసభలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నిస్తే మహిళ అని చూడకుండా ఆమెను అవమానించారని మండిపడ్డారు.

రుణమాఫీకి బీఆర్ఎస్ హయాంలో రాని సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో చెప్పాలన్నారు. రైతు రుణమాఫీ విషయంలో మిన్నకుంటే రైతు భరోసా విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వెంటపడి మరీ రైతులు రుణమాఫీపై నిలదీయాలని సూచించారు. ఈ ఆందోళన తొలి అడుగేనని... షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేసేదాకా వదిలి పెట్టేది లేదన్నారు.

  • Loading...

More Telugu News