Sheikh Hasina: షేక్ హసీనాకు బంగ్లా ప్రభుత్వం మరో ఝ‌ల‌క్‌!

Bangladesh Interim Govt Revokes Diplomatic Passport of Sheikh Hasina

  • మాజీ ప్ర‌ధాని దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసిన బంగ్లా ప్రభుత్వం
  • హ‌సీనాతో పాటు ఆమె పార్టీకి చెందిన మాజీ ఎంపీల దౌత్య పాస్‌పోర్ట్‌లు కూడా ర‌ద్దు
  • దౌత్య పాస్‌పోర్టుతో కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటు

మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్‌పోర్ట్‌ను బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. హసీనాతో పాటు ఆమె పార్టీకి చెందిన మాజీ ఎంపీల దౌత్య పాస్‌పోర్ట్‌లను కూడా క్యాన్సిల్‌ చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దౌత్య పాస్‌పోర్టు ఉన్న‌వారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటును క‌లిగి ఉంటారు. 

ఇక బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా చెల‌రేగిన‌ నిర‌స‌నల కారణంగా హ‌సీనా త‌న‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆమె ఏకంగా దేశాన్ని కూడా వ‌దిలిపెట్టాల్సి వ‌చ్చింది. అలా ఈ నెల 5న బంగ్లాదేశ్‌ను వీడిన షేక్ హ‌సీనా ప్ర‌స్తుతం ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. 

ఈ క్ర‌మంలో షేక్‌ హసీనాను తమ దేశానికి అప్పగించాలని ఇప్పటికే బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) భార‌త ప్ర‌భుత్వాన్ని కోరింది. బంగ్లాదేశ్‌ విజయాన్ని అడ్డుకునేందుకు భారత్ నుంచి ఆమె కుట్ర చేస్తున్నారని ఈ సంద‌ర్భంగా బీఎన్‌పీ ఆరోపించింది.

కాగా, నిర‌స‌న‌ల్లో చెల‌రేగిన హింస కార‌ణంగా చ‌నిపోయిన వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హసీనాపై పదుల సంఖ్యలో హత్య కేసులు నమోదయ్యాయి. ప్ర‌స్తుతం ఆమె మొత్తంగా 44 కేసులను ఎదుర్కొంటున్న‌ట్లు స‌మాచారం. 

  • Loading...

More Telugu News