Vivek Agnihotri: కోల్‌కతా హత్యాచారం... మమతా బెనర్జీపై 'కశ్మీరీ ఫైల్స్' డైరెక్టర్ తీవ్ర విమర్శలు
- మహిళల భద్రతపై మాట్లాడేందుకు మమత ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్న
- పాలకులు సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
- ఆ ప్రిన్సిపల్‌ను మరో మెడికల్ కాలేజీలో ఎందుకు అపాయింట్ చేశారని నిలదీత
పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉంటున్నారని ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బుధవారం మండిపడ్డారు. జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ కోల్‌కతాలో స్వచ్ఛంద సంస్థ 'ఖోలా హవా' నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు "కశ్మీరీ ఫైల్స్" దర్శకుడు బెంగాల్ రాజధానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆమె బయటకు వచ్చి మహిళలపై నేరాలను సహించేది లేదని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కానీ మమతా బెనర్జీ అలా చేయడం లేదన్నారు.
రాజకీయాల కోసం రాష్ట్రంలోని పాలకులు సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేసిన తర్వాత మరో మెడికల్ కాలేజీలో ఎందుకు అపాయింట్ చేశారు? ఈ కేసును తొలుత ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు? సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
కోల్‌కతా పోలీసులు ఈ కేసు విచారణలో విఫలమయ్యారని, అందుకే సీబీఐ దర్యాఫ్తు చేపట్టవలసి వచ్చిందన్నారు. బెంగాల్ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవస్థలో మార్పు రావాలని ఆకాంక్షించారు. మరోవైపు, ఈ హత్యాచారాన్ని నిరసిస్తూ క్రీడా ప్రముఖులు ప్రత్యేకంగా నిరసన ర్యాలీని చేపట్టారు.