Nagineni Kannayya Naidu: నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై ప్రముఖ ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఆందోళన

Crest Gate Expert Kannayya Naidu Concerns About Srisailam And Nagarjuna Sagar Projects

  • ప్రాజెక్టుల వయసు అయిపోయిందన్న విశ్రాంత ఇంజినీర్ కన్నయ్య నాయుడు
  • వాటిని ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ లైఫ్‌లోనే నడిపిస్తున్నట్టు వెల్లడి
  • రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవాలని సూచన
  • తుంగభద్రకు అన్ని గేట్లు బిగించుకోవాలన్న కన్నయ్య
  • అలా అయితే మరో 30 ఏళ్లు ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టీకరణ

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ విశ్రాంత ఇంజినీర్, భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్‌ లాగ్‌ను విజయవంతంగా అమర్చిన ఆయన నీటి వృథాను అరికట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం ముగుస్తోందని, ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందించి అవసరమైన చర్యలు చేపట్టాలని కన్నయ్య నాయుడు సూచించారు. ‘ఈటీవీ’ ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలను పంచుకున్నారు.

1970కి ముందు నిర్మించిన ప్రాజెక్టులకు స్టాండ్ బై గేట్లు ఏర్పాటు చేయలేదని కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. కాబట్టే, ఇప్పుడు తుంగభద్రకు స్టాప్‌లాగ్ బిగించాల్సి వచ్చిందని తెలిపారు. తుంగభద్రకు ప్రమాదం పొంచి ఉందని రెండేళ్ల క్రితమే చెప్పానని, ఒకవేళ సమస్య వస్తే ఏం చేయాలనే దానిపై అప్పటి నుంచే ఆలోచించినట్టు తెలిపారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన తర్వాత అక్కడికి వెళ్లి చూసిన తనకు ప్రాణం చలించిపోయిందని, రైతులకు అందాల్సిన నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని బాధ అనిపించిందని పేర్కొన్నారు. 

తుంగభద్ర డ్యాం గేట్ల వయసు అయిపోయిందని, కొత్త గేట్లు బిగించుకోవాల్సిందేనని చెప్పానని, అలా అయితే మరో 30 ఏళ్లపాటు దాని సేవలు అందించవచ్చని వివరించానని కన్నయ్యనాయుడు పేర్కొన్నారు. కాబట్టి డ్యాం భాగస్వాములు ముగ్గురూ కలిసి కూర్చుని చర్చించుకోవాలని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఇందుకు మొత్తం రూ. 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పానని పేర్కొన్నారు. వారు అందుకు తగిన చర్యలు తీసుకుంటే అవసరమైన సాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పానని వివరించారు.

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వయసు కూడా అయిపోయిందని, వాటిని ఇప్పుడు ఎక్స్‌టెన్షన్‌లోనే నడుపుతున్నట్టు కన్నయ్యనాయుడు తెలిపారు. తుంగభద్రలాంటి ఘటనలు దేశంలో జరిగినా.. నీళ్లు ఉండగా ఎక్కడా స్టాప్ లాగ్‌లు అమర్చలేదని స్పష్టం చేశారు. సాగర్, శ్రీశైలం విషయంలో రెండు ప్రభుత్వాలు కూర్చుని ప్లాన్ యాక్షన్ వేసి చర్యలు తీసుకోకపోతే కష్టమేనని కన్నయ్యనాయుడు తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News