Andhra Pradesh: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వంపై ప్రతినెలా రూ.260 కోట్ల వరకు అదనపు భారం!
![Report on Free Bus Facility for Women in Andhra Pradesh](https://imgd.ap7am.com/thumbnail/cr-20240821tn66c5684578177.jpg)
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సిద్ధమైన నివేదిక
- అదనంగా 2వేల బస్సులు, 3500 మంది డ్రైవర్లు అవసరమన్న అధికారులు
- నేటి సమీక్షలో దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు జరుగుతోంది. ఈ విషయమై అధికారుల కమిటీ తాజాగా నివేదికను సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే రద్దీ పెరుగుతుందని, అదనంగా బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తే అదనంగా 2వేల కొత్త బస్సులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10వేల బస్సులు ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220. మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం కిందట 1,480 కొత్త బస్సులు కొనుగోలు చేశారు.
అటు చాలాకాలంగా ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు లేకపోవడం, అదే సమయంలో పదవీ విరమణలు జరగడంతో ఆర్టీసీలో డ్రైవర్ల కొరత ఏర్పడింది. అందుకే కొత్తగా 3,500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు తమ వేదికలో పేర్కొన్నారు.
ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీ నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే ఆదాయంలో 25 శాతం వరకు అంటే రూ.125 కోట్ల వరకు ప్రభుత్వానికి వెళ్తోంది. ఇకపై ఆ మొత్తంతో పాటు మిగిలిన రూ.125 నుంచి రూ.135 కోట్లను అదనంగా సర్కారే భరించాల్సి ఉంటుంది.
కాగా, గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ అధికారులు కర్ణాటక, తెలంగాణలో ఉచిత ప్రయాణంపై అధ్యయనం చేసిన వివరాలను తెలియజేయనున్నారు. వాటి ఆధారంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే కలిగే లోటుపాట్లను సీఎం అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.