Railway Board: రైలు ప్రమాదాల నివారణకు కీలక ప్రణాళిక ప్రకటించిన రైల్వే

Railway Board has announced plans to install CCTV cameras equipped with AI

  • అన్నీ రైళ్లు, కీలక యార్డుల వద్ద ఏఐ సాంకేతికతతో కూడిన కెమెరాలను అమర్చనున్న రైల్వే
  • అసాధారణ పరిస్థితులను గుర్తించేందుకు సాయపడతాయన్న రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా
  • కుంభమేళా సన్నాహాలపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు

దేశంలో పెరిగిపోతున్న రైలు ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ప్రణాళిక ప్రకటించింది. అన్ని రైళ్లు, కీలకమైన అన్ని రైల్వే యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా ప్రకటించారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 

ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే ట్రాక్ భద్రత గురించి మాట్లాడారు.

వచ్చే ఏడాది కుంభమేళా నేపథ్యంలో సంఘవిద్రోహులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భద్రతా సంస్థలు రైల్వే ట్రాకులపై నిరంతర నిఘా ఉంచుతాయని సిన్హా స్పష్టం చేశారు. ఈ మేరకు కుంభమేళా సన్నాహాలను సమీక్షించారు. 

కుంభమేళా ప్రారంభానికి ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, విస్తరణ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 కుంభమేళా సందర్భంగా సుమారు 530 ప్రత్యేక రైళ్లను నడిపారని ఆమె ప్రస్తావించారు. ఇక 2025లో జరిగే కుంభమేళా కోసం దాదాపు 900 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించారు.

ఇక ఈ కుంభమేళాకు 30 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో రద్దీ నివారణకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిన్హా వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌ను అమృత్ భారత్ స్టేషన్‌గా ఎంపిక చేశామని ఆమె వెల్లడించారు. 

ఇక దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఆధునికీకరణ, భద్రతా చర్యల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ పట్టాలు తప్పడం, రైళ్లు ఢీకొనడం, లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ప్రస్తావించారు. కాగా గత ఐదేళ్లలో దేశంలో అనేక రైల్వే ప్రమాదాలు జరిగాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

  • Loading...

More Telugu News