Dwarampudi Chandrasekhar Reddy: ద్వారంపూడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో ఆందోళన
- ఇళ్ల పట్టాలలో అవినీతికి పాల్పడ్డారన్న టీడీపీ నేత వర్మ
- ఇళ్ల స్థలాలను అక్రమంగా విక్రయించారని ఆరోపణ
- కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శలు
కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అధికార ప్రతినిధి వర్మ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాకినాడ నగర ప్రజల ఇళ్ల పట్టాల కోసం కొత్తపల్లి మండలం కొమరిగిరిలో 350 ఎకరాల భూమిని సేకరించారని... ఈ భూమిని చదును చేయడం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్టు చూపి అవినీతికి పాల్పడ్డారని వర్మ ఆరోపించారు.
13 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి... తన బినామీలకు ఇళ్ల స్థలాలను కట్టబెట్టారని... ఆ తర్వాత ఆ స్థలాలను అక్రమంగా విక్రయించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలం మత్స్యకారులకు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ మోహన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నాయి. ద్వారంపూడికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.