Revanth Reddy: వాటన్నింటినీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకు రావాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy review on Sports University

  • ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సమీక్ష
  • దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్రబిందువుగా ఉండాలన్న సీఎం
  • భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఒలింపిక్స్‌కు వేదికగా మార్చాలన్న సీఎం

తెలంగాణలోని అన్ని యూనివ‌ర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని క్రీడా పాఠ‌శాల‌లు, అకాడ‌మీలు, క్రీడా శిక్ష‌ణ సంస్థ‌లు అన్నింటిని స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తీసుకు రావాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయ‌నున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏ విధంగా ఉండాలనే అంశంపై అధికారులకు ఆయన ఈరోజు సూచనలు చేశారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాల‌ని ఆకాంక్షించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో ప్ర‌తి క్రీడ‌కు ప్రాధాన్యం ఉండాల‌న్నారు. అన్ని ర‌కాల క్రీడల‌ను, క్రీడా శిక్ష‌ణ సంస్థ‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకు రావడమే స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ల‌క్ష్య‌మ‌న్నారు.

స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో మ‌న దేశ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో రాణించే షూటింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, అర్చ‌రీ, జావెలిన్ త్రో, హాకీకి ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పతకాలు సాధించే అవకాశాలు ఉన్న క్రీడల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. యూనివ‌ర్సిటీలో ఆయా క్రీడ‌ల్లో శిక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు, ఆహారంతో పాటు అంత‌ర్జాతీయస్థాయి ప్రమాణాలు ఉండాలన్నారు. మన దేశంతో పాటు తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు, శరీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడలను గుర్తించి... ఉత్సాహవంతులను ప్రోత్సహించాలన్నారు.

గతంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు హైదరాబాద్‌ను వేదికగా మార్చాలన్నారు. ప్రతి క్రీడలో మన వాళ్లు పతకాలు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకోసం నిపుణులతో శిక్షణ ఇప్పించాలన్నారు.

  • Loading...

More Telugu News