Uttam Kumar Reddy: వారికి రుణమాఫీ ఎందుకు కాలేదో వెల్లడించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy reveals about loan waiver

  • సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదన్న మంత్రి
  • ఆధార్ నెంబర్లు, రేషన్ కార్డులు సరిగ్గా లేక మాఫీ జరగలేదని వెల్లడి
  • తెలంగాణలో జరిగిన రుణమాఫీ దేశంలో ఎప్పుడూ జరగలేదన్న మంత్రి

సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని, అలాంటి వారికి కూడా నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో ఇప్పుడు జరిగిన రుణమాఫీ దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు.

రైతులను రుణ విముక్తులను చేసేందుకు తాము సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. 2014 తర్వాత బీజేపీ ఎప్పుడూ రుణమాఫీ ఊసే ఎత్తలేదన్నారు. రుణమాఫీపై రాజకీయ దురుద్దేశంతో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 

కొంతమంది రైతులకు రుణమాఫీ జరగకపోవడంపై మంత్రి వివరణ ఇచ్చారు. 1.20 లక్షల రైతు ఖాతాలకు ఆధార్ నెంబర్లు సరిగ్గా లేవన్నారు. అలాంటి వారికి రుణమాఫీ జరగలేదన్నారు. కొన్ని ఖాతాల్లో వివరాలు సరిగ్గా లేకపోవడం, రేషన్ కార్డులు సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమందికి రుణమాఫీ జరగలేదన్నారు. వాటిని సవరించడానికి ప్రక్రియను ప్రారంభించామన్నారు.

ప్రతి మండలంలో మండల వ్యవసాయాధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు. వారు రుణమాఫీ కాని రైతుల వివరాలను తీసుకొని పోర్టల్‌లో అప్ లోడ్ చేస్తే మాఫీ చేస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ చేసి తీరుతామన్నారు.

  • Loading...

More Telugu News