Polavaram Files: దగ్ధమైన పోలవరం ప్రాజెక్టు ఫైళ్లను పరిశీలించిన మంత్రి దుర్గేశ్... ఆర్డీవో తీరుపై ఆగ్రహం

Minister Kandula Durgesh visits Polavaram project office

  • ధవళేశ్వరంలో ఘటన
  • పోలవరం ప్రాజెక్టు ఆఫీసు వద్ద ఫైళ్లు తగలబెట్టిన వైనం
  • బాధ్యులపై చర్యలు తప్పవన్న మంత్రి కందుల దుర్గేశ్

ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఫైళ్లు తగలబెట్టిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించారు. దగ్ధమైన ఫైళ్లను పరిశీలించారు. సిబ్బంది బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతేకాదు, కాలిపోయిన ఫైళ్లను జిరాక్స్ కాపీలు అంటూ ఆర్డీవో శివజ్యోతి ప్రకటించడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, బాధ్యులైన సిబ్బందిని రక్షించే ప్రయత్నం చేయవద్దని ఉద్ఘాటించారు. బాధ్యులపై కఠిన చర్యలకు వెనుకాడబోము అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.

కాగా, పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, ఎస్పీ నరసింహ కిశోర్ కూడా సందర్శించారు. తగలబడిన ఫైళ్లను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ... ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ఎస్పీ నరసింహ కిశోర్ స్పందిస్తూ... ఘటనపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేశారని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పారు.

More Telugu News