Monsoon Brides: పాకిస్థాన్‌లో ‘వర్షాకాలం వధువులు’.. డబ్బుల కోసం భార్యలుగా మారుతున్న బాలికలు!

Pakistan Girls Changes As Monsoon Brides For Money

  • 2022 వరదల తర్వాత పాక్‌లో మారిన వాతావరణ పరిస్థితులు
  • ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బాలికలకు వివాహాలు
  • రెట్టింపు వయసు వారికి ఇచ్చి వివాహాలు జరిపిస్తున్న కుటుంబ సభ్యులు 
  • అందుకు రూ. 2.5 లక్షలు చెల్లిస్తున్న వరుడు
  • వీరిని ‘మాన్‌సూన్ బ్రైడ్స్’గా అభివర్ణించిన ఎన్‌జీవో

పొరుగు దేశం పాకిస్థాన్‌లో దారుణాతి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న వేళ అక్కడ ‘వానాకాలం వధువులు‘ బలవంతంగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అక్కడి కుటుంబాలు నిండా 14 ఏళ్లు కూడా నిండని బాలికలకు వివాహాలు జరిపిస్తున్నారు. ఈ వివాహాలకు బాలికలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరిస్తున్నారు. 

తనకు పెళ్లవుతుందని తెలిసి సంతోషంగా ఉందని షామిల అనే 14 ఏళ్ల అమ్మాయి చెప్పుకొచ్చింది. ఇప్పుడు తనకు ఎంచక్కా తిండి దొరుకుతుందని, కడుపు మాడ్చుకోవాల్సిన పనిలేదని పేర్కొంది. ఆమె తన వయసు కంటే రెండింతల పెద్దవాడైన ధనవంతుడిని పెళ్లాడబోతోంది. 13 ఏళ్ల ఆమె సోదరి అమీనా కూడా ఇలాగే డబ్బుల కోసం పెళ్లికి సిద్ధమైంది. ఇలా బాలికలను పెళ్లాడుతున్న వారు ఆమె కుటుంబ సభ్యులకు రూ. 2.5 లక్షలు (పాక్ కరెన్సీ) చెల్లించుకుంటున్నారు.

వరదలతో మారిన పరిస్థితులు
నిజానికి పాకిస్థాన్‌లో బాల్య వివాహాలు ఎక్కువే అయినా ఇటీవలి కాలంలో అవి తగ్గుముఖం పట్టాయి. అయితే, రెండేళ్ల క్రితం సంభవించిన వరదలతో పాక్ అల్లకల్లోలం అయింది. వాతావరణ పరిస్థితులు పూటగడవని స్థితికి తీసుకొచ్చాయి. దీంతో బాలికలకు వివాహాలు చేసి వారికి తిండీబట్టకు లోటు లేకుండా చేయడమే కాకుండా తామూ కాస్తంత స్థిమిత పడాలని కుటుంబాలు కోరుకుంటున్నాయి.

బలవంతంగా పెళ్లిపీటలు ఎక్కుతున్న మాన్‌సూన్ బ్రైడ్స్
జులై-సెప్టెంబర్ మధ్య పాకిస్థాన్‌లో సంభవించే వానల కారణంగా వరదలు సంభవించడం, కొండచరియలు విరిగి పడుతుండడంతో రైతులు పంట నష్టపోతున్నారు. దీంతో కుటుంబ ఆర్థిక భద్రత కోసం రెట్టింపు వయసువాడైనా సరే అతడికిచ్చి తమ కుమార్తెలను కట్టబెట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడు వీరిని ‘మాన్‌సూన్ బ్రైడ్స్’గా పిలుస్తున్నారు.

బతికేందుకు బాల్య వివాహాలే దారి
2022లో సంభవించిన వరదలు బాల్య వివాహాలకు మరింత ఆజ్యం పోసినట్టు ‘సుజగ్ సంసార్’ అనే ఎన్‌జీవో వ్యవస్థాపకుడు మషూక్ బిర్హ్‌మణి పేర్కొన్నారు. బతికేందుకు ఏదో ఒక మార్గాన్ని కుటుంబాలు ఎంచుకుంటున్నాయని, అందులో బాల్య వివాహాలే ఎక్కువగా ఉంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2022 వరదలకు ముందు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. షామిలా వివాహం చేసుకున్న ఖాన్ మొహమ్మద్ మల్లా గ్రామంలో గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు 45 బాలికలు భార్యలుగా మారారని వివరించారు. అయితే, ఇలాంటి వివాహాలను నచ్చజెప్పి వాయిదా వేస్తున్నట్టు మషూక్ తెలిపారు.

  • Loading...

More Telugu News