Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy leaves for New Delhi

  • రాజధానిలో రెండు రోజుల పాటు ఉండనున్న రేవంత్ రెడ్డి
  • ఢిల్లీలో ఫాక్స్‌కాన్, ఆపిల్ సంస్థల ప్రతినిధులతో భేటీ
  • ఎల్లుండి పార్టీ అగ్రనాయకులతో సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. విదేశీ పర్యటన ముగించుకొని నిన్న హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు రాజ్ భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన దేశ రాజధానిలో రెండు రోజుల పాటు ఉండనున్నారు.

రేపు ఢిల్లీలో ఫాక్స్‌కాన్, ఆపిల్ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మరికొన్ని కంపెనీల ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై చర్చిస్తారు. శనివారం నాడు పార్టీ అగ్రనేతలతో సమావేశమై కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నారు.

ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలతో సమావేశమవుతారు. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియాగాంధీని ఆహ్వానించనున్నారు. రుణమాఫీ నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞత బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు. తిరిగి శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు.

Revanth Reddy
Congress
New Delhi
  • Loading...

More Telugu News