Revanth Reddy: హరీశ్ రావుకు సిగ్గుంటే... చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy demands for Harish rao resignation

  • ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్న రేవంత్ రెడ్డి
  • రైతు రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ చేశారన్న సీఎం
  • ఎన్నికల్లో ఓడిపోయినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదని చురక

ఇచ్చిన హామీ మేరకు తాము రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, హరీశ్ రావుకు సిగ్గుంటే... చీము నెత్తురు ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో ఏర్పాటు చేసిన మూడో విడత రైతు రుణమాఫీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అన్నారు. 2022 మే 6న చెప్పిన రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేశామన్నారు.

రుణమాఫీపై తాము హామీ నిలబెట్టుకున్నందున హరీశ్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటకు పీడ విరగడవుతుందన్నారు. అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావే అన్నారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సవాల్‌గా తీసుకొని చేశారన్నారు.

బీఆర్ఎస్ నేతలు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే 8 నెలల ఇందిరమ్మ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ జనాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు తాము నిరంతరం కష్టపడుతున్నామన్నారు. కాంగ్రెస్ మోసం చేసిందంటూ కేటీఆర్ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ కేటీఆర్‌కు బుద్ధి రాలేదని చురక అంటించారు. బీఆర్ఎస్ బతుకు ఇప్పటికే బస్టాండ్ అయిందన్నారు. బంజారాహిల్స్ బస్టాండ్‌లో అడుక్కుతినే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది అని ఎద్దేవా చేశారు. ప్రజలు బీఆర్ఎస్‌ను బొందపెట్టి బంగాళాఖాతంలో కలిపేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత, రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత తనదే అన్నారు. జై కాంగ్రెస్ నినాదాలతో ఫాంహౌస్‌లోని కేసీఆర్, ఢిల్లీలోని మోదీ బెదరాలన్నారు.

  • Loading...

More Telugu News