Assam Hospital: ఒంటరిగా ఉండొద్దు.. మెడికోలకు అస్సాం వైద్య కళాశాల సూచన

Assam Hospital Advisory After Kolkata Rape Murder

  • కోల్ కతా డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో సిల్చార్ మెడికల్ కాలేజీ అడ్వైజరీ
  • రాత్రిపూట అత్యవసరమైతే తప్ప హాస్టల్ దాటొద్దని హెచ్చరిక
  • మహిళా వైద్యులు, స్టూడెంట్లు అప్రమత్తంగా ఉండాలని నోటీసు
  • సెక్యూరిటీ పెంచకుండా సూచనలు ఇవ్వడంపై మండిపడుతున్న మెడికోలు

‘ఒంటరిగా ఉండొద్దు, రాత్రిపూట బయటకు వెళ్లొద్దు.. అప్రమత్తంగా ఉండండి’ అంటూ అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ తమ స్టూడెంట్లకు అడ్వైజరీ జారీ చేసింది. మహిళా వైద్యులు, మెడికోలు ఒంటరిగా ఉండే పరిస్థితిని అవాయిడ్ చేయాలని పేర్కొంది. రాత్రిపూట హాస్టల్, లాడ్జింగ్ రూమ్స్ నుంచి బయటకు వెళ్లొద్దని, ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే అధికారులకు సమాచారం అందించాలని హెచ్చరించింది. కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రెయినీ డాక్టర్ హత్యాచారం ఘటన నేపథ్యంలో తాజా సూచనలు చేసింది.

గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులతో ఉన్నపుడు జాగరూకతతో వ్యవహరించాలని కాలేజ్ మేనేజ్ మెంట్ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేసే కాంటాక్ట్స్ పెంచుకోవాలని మహిళా వైద్యులు, స్టూడెంట్లకు సూచించింది. డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతగా లీనమైపోయినా చుట్టుపక్కల పరిస్థితులను గమనిస్తూ ఉండాలని చెప్పింది.

చుట్టూ ఉన్న రోగులు కానీ, ఇతర సిబ్బందితో కానీ కలివిడిగా ఉండడం ద్వారా అనుమానాస్పద వ్యక్తుల అటెన్షన్ ను దూరం చేసుకోవచ్చని సూచించింది. పని ప్రదేశంలో ఏవైనా వేధింపులు ఎదుర్కొంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఇలా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించింది. ఈమేరకు సిల్చార్ మెడికల్ కాలేజీ తాజాగా ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసింది. మహిళా డాక్టర్లు, మెడికోలు, హాస్పిటల్ సిబ్బంది క్షేమం కోరుకుంటూ ఈ అడ్వైజరీని జారీ చేసినట్లు వివరించింది.

మండిపడుతున్న స్టూడెంట్లు..
క్యాంపస్ లో ఎలా ఉండాలో చెబుతూ మేనేజ్ మెంట్ జారీ చేసిన అడ్వైజరీపై స్టూడెంట్లు మండిపడుతున్నారు. క్యాంపస్ లో, హాస్పిటల్ లో మహిళా వైద్యులు, స్టూడెంట్ల రక్షణ కోసం సెక్యూరిటీ ఏర్పాట్లను మరింత పెంచాల్సింది పోయి ఇలాంటి అడ్వైజరీ జారీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లొద్దు, ఒంటరిగా ఉండొద్దని తమకు బోధించడం కన్నా సెక్యూరిటీని పెంచే చర్యలు చేపట్టాలని పేర్కొంటున్నారు. క్యాంపస్ లో లైటింగ్ సదుపాయాలను పెంచాలని, డాక్టర్ల రూమ్ లలో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఈ అడ్వైజరీపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇలాంటి అడ్వైజరీని కాలేజీ, ఆసుపత్రిలోని పురుషులకు జారీ చేయాలని చెప్పారు.

  • Loading...

More Telugu News