Anagani Satyaprasad: అయ్యా.. జోగి రమేశ్!.. మాజీ మంత్రి వ్యాఖ్యలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్

Minister Anagani Satyaprasad counter to former minister Jogi Ramesh

  • అవినీతి చేసి అరెస్టై కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని అనగాని మండిపాటు
  • గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు కులం గుర్తురాలేదా అని ప్రశ్న
  • అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తన కొడుకు అరెస్ట్‌పై జోగి రమేశ్ వ్యాఖ్యలకు మంత్రి అనగాని కౌంటర్

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసంలో ఇవాళ (మంగళవారం) ఉదయం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో జోగి రమేశ్ కొడుకు జోగి రాజీవ్‌ (ఏ1)ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

అయితే బలహీన వర్గాలకు చెందిన తనను ఇబ్బంది పెట్టి ఆనందం పొందుతున్నారంటూ ప్రభుత్వంపై జోగి రమేశ్ ఆరోపణ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు మంత్రి, టీడీపీ సీనియర్ నేత అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.

‘‘అయ్యా.. జోగి రమేశ్! గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్‌ను అన్యాయంగా మీ ప్రభుత్వ హయాంలో హత్య చేస్తే ఆ బిడ్డకు న్యాయం చేయకపోగా.. న్యాయం చేయాలని నిరసన తెలిపిన వారిపై లాఠీఛార్జ్ చేసినపుడు కులం గుర్తు రాలేదా?’’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ‘‘నువ్వు అవినీతి చేసి అడ్డంగా దొరికి అరెస్టైతే.. కులం అడ్డం పెట్టుకొని జాతిని మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో గౌడ బిడ్డలు లేరు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 

జోగి రమేశ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను కూడా మంత్రి షేర్ చేశారు. 'అప్పుడు ఇప్పుడు' అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షంపై జోగి రమేశ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టుపెడతారంటూ నాడు విపక్ష టీడీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. కులాలు కూడు పెట్టవని, కులాన్ని కాపాడుకోవాలి కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేయకూడదన్నారు. 

తాజాగా తన ఇంట్లో సోదాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ‘‘జోగి రమేశ్ ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సిందిబోయి.. మాపై కక్షగట్టి, మమ్నల్ని జైలుపాలు చేసి మీరు ఆనందం పొందుతారు... ఏమిటీ దుర్మార్గం!’ అని జోగి రమేశ్ వ్యాఖ్యలు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.


  • Loading...

More Telugu News