Jogi Rajeev: మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు రాజీవ్‌ అరెస్ట్‌!

Ex Minister Jogi Ramesh Son Jogi Rajeev Arrested

  • అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేశ్ 
  • సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు ఆరోపణలు
  • ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయ‌న‌ నివాసంలో సోదాలు
  • ప‌లు రికార్డులు, డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ బృందం
  • అనంత‌రం జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు


అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకుని తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా, పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా జోగి రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సోదాలను ప్రభుత్వ కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. "నా తండ్రిపై ఉన్న కక్షతోనే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మేము కూడా ఇతరుల్లానే భూములు కొనుగోలు చేశాం. అందులో తప్పేముందో నాకు అర్థం కావడం లేదు" అని రాజీవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపిస్తూ, ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. 

సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు జోగి రమేశ్‌పై ఆరోపణలు రావడంతో, ఈ కేసు నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News