Akhilesh Yadav: బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav Foreign Policy Advice To Centre

  • ఒక దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దన్న అఖిలేశ్ యాదవ్
  • నాలుగు గంటల వ్యవధిలో రెండు ట్వీట్లు చేసిన అఖిలేశ్ యాదవ్
  • హిందువులు, మైనార్టీలపై దాడులు జరగకుండా చూడాలని బంగ్లా ప్రభుత్వానికి సూచన

ఏ దేశమైనా తన రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి... పొరుగు దేశంలోని పరిస్థితులను ఉపయోగించుకోవడం దేశాన్ని బలహీనపరుస్తుందని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆయన నేరుగా ఏ దేశం పేరును ప్రస్తావించనప్పటికీ... బంగ్లాదేశ్ పరిస్థితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రెండు ఆసక్తికర ట్వీట్లు చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో అఖిలేశ్ యాదవ్ నాలుగు గంటల వ్యవధిలో రెండు పోస్టులు చేశారు. మొదటి దాంట్లో బంగ్లాదేశ్ పేరు పేర్కొనలేదు. కానీ రెండో ట్వీట్‌లో మాత్రం బంగ్లా పేరును ప్రస్తావించారు.

ఒక దేశంలోని పరిస్థితులను మరో దేశం ఆసరాగా చేసుకొని తమకు అనుగుణంగా ఉపయోగించుకోవాలనుకుంటే అది వారిని అంతర్గతంగా బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఒక దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం సరైన చర్య కాదన్నారు. అక్కడి ప్రదర్శనలు హింసాత్మకంగా మారితే మౌనంగా ఉండటం కూడా సరికాదని పేర్కొన్నారు. అది విదేశంగ విధాన వైఫల్యమే అవుతుందన్నారు.

ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మరో పోస్ట్ చేశారు. వివిధ కారణాలతో అనేక దేశాల్లో హింసాత్మక విప్లవాలు, సైనిక తిరుగుబాట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతుంటాయని, అవి సరైనవా? కావా అనే విషయం పక్కన పెడితే... ఈ సమయంలో మతం, భావజాలం, మెజార్టీ, మైనార్టీ ప్రాతిపదికన వివక్ష చూపకుండా అందరినీ సమానంగా పరిగణించి రక్షించాలని సూచించారు. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలపై దాడులు జరగకుండా చూడాలని అక్కడి ప్రభుత్వానికి సూచించారు.

  • Loading...

More Telugu News