Sleepmakers: చైనాలో యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన!

Chinas New Profession Sleepmakers They Help To Sleep Youth

  • 996 వర్క్ కల్చర్‌తో నిద్రకు దూరమవుతున్న యువత
  • వైవాహిక జీవితంలో ఒత్తిళ్లతో సతమతం
  • వారిని  లాలించి నిద్ర పుచ్చడమే స్లీప్ మేకర్స్ పని

చైనాలో ఇప్పుడు ‘స్లీప్ మేకర్స్’ అనే కొత్త వృత్తి పుట్టుకొచ్చింది. ఇప్పుడు దీనికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో చాలామంది పార్ట్‌టైంగానూ దీనిని ఎంచుకుని రెండు చేతులా సంపాదిస్తున్నారు. చైనాలో ‘996 వర్క్ కల్చర్’ బాగా పాప్యులర్ అయింది. వారంలో ఆరు రోజులు రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయడాన్నే 996 వర్క్ కల్చర్‌గా పిలుస్తున్నారు. 

ఈ పని విధానం వల్ల వైవాహిక జీవితంతోపాటు నిత్య జీవితంలో యువత తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొని నిద్రకు దూరమై మరిన్ని ఇబ్బందులకు గురవుతోంది. దీంతో వారిని నిద్రపుచ్చేందుకు ‘స్లీప్ మేకర్స్’ అనే కొత్త వృత్తి పుట్టుకొచ్చింది. బాధితులతో ఈ స్లీప్ మేకర్స్ మనసు విప్పి మాట్లాడుతూ వారి బాధలను పంచుకుంటారు. వారి గుండెల్లోని బాధను తొలగించి వారు హాయిగా నిద్రపోయేలా చేస్తారు.  

ఇప్పుడిలాంటి సేవలు అందించేందుకు కొన్ని సంస్థలు పోటీపడుతున్నాయి. కొందరు వ్యక్తిగతంగానూ సేవలు అందిస్తున్నారు. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ నిద్రకు దూరమవుతున్న వారికి స్లీప్‌మేకర్స్ ఎమోషనల్‌గా సపోర్ట్ ఇస్తారు. వారితో కలిసిపోయి మాట్లాడతారు. వారి బాధలు పంచుకుంటారు. బెడ్‌టైం స్టోరీలు చెబుతూ లాలించి నిద్రపుచ్చుతారు. ఈ సేవలు అందించేందుకు గంటకు 260 యువాన్లు చార్జ్ చేస్తున్నారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ. 3 వేలు. 

స్లీప్ మేకర్‌గా పార్ట్‌టైం చేస్తున్న టావోజీ అనే అమ్మాయి మాట్లాడుతూ.. చాలామంది తమ వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యలు, స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. దీనివల్ల వారు ఆ సమస్యలను తలచుకుని మానసికంగా సతమతమవుతుంటారని పేర్కొన్నారు. అలాంటి వారి సమస్యలను తాము శ్రద్ధగా విని వారి గుండె బరువును తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. వారు కూడా సమస్యలు చెప్పుకున్నాక తేలికపడి హాయిగా నిద్రపోతారని వివరించారు. ఇప్పుడీ వ్యాపారం చైనాలో మూడుపువ్వులు ఆరు కాయులుగా విస్తరిస్తోంది. కాగా, 996  వర్క్ కల్చర్ బారినపడి నిద్రకు దూరమవుతున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండడం గమనార్హం.

  • Loading...

More Telugu News