KTR: కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే గడ్డుకాలం: కేటీఆర్

BRS Working President KTR Criticizes Congress Government

  • ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింద‌న్న కేటీఆర్‌
  • సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం అంటూ మండిపాటు
  • కాంగ్రెస్‌ పాలనలో రైతులకు భరోసానే లేకుండా పోయింద‌ని ఆవేద‌న‌

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిగా మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగంగా ఉండేద‌ని, అదే కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని దుయ్య‌బ‌ట్టారు. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింద‌ని విమ‌ర్శించారు. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో ఎనిమిది నెలల్లోనే ఎందుకింత విధ్వంసం అని ప్రశ్నించారు. 

సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం అని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులకు భరోసానే లేకుండా పోయింద‌న్నారు. రుణమాఫీ అని మభ్య పెట్టి పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అని తెలిపారు. బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం మాటలు కోటలు దాటుతున్నయ్, కానీ చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు అంటూ ట్వీట్‌ చేశారు.

  • Loading...

More Telugu News