Kamala Harris: కమలాహారిస్ తనను కాపీ కొట్టారంటున్న ట్రంప్
- కార్మికుల కనీస వేతనాల పెంపునకు కృషి చేస్తానని హామీ ఇస్తున్న కమలా హారిస్
- సేవలరంగంలో టిప్ లపై పన్ను ఎత్తివేస్తామని హామీ
- ఆ రాష్ట్రాల సర్వేల్లో కమలా హరిస్ ముందంజ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ లు వివిధ రకాల హామీలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో రెస్టారెంట్లలో పని చేసే కార్మికులతో పాటు ఇతర సేవల రంగంలోని వారికి ఇచ్చే టిప్ లపై పన్నును ఎత్తివేస్తామని కమలా హారిస్ కీలక హామీ ఇచ్చారు. ఆమెరికాలోని కార్మిక కటుంబాల తరపున పోరాడతానని చెప్పుకొస్తున్నారు. లాస్ వేగాస్ లోని యూనివర్శిటీ ఆఫ్ నెవాడాలో జరిగిన ర్యాలీలో కమలా హారిస్ మాట్లాడారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమలపై దేశ ఆర్ధిక వ్యవస్థ ఆధారపడి ఉందని ఆమె పేర్కొన్నారు. కార్మికుల కనీస వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అయితే కమలా హారిస్ హామీలపై డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. సేవల రంగంలోని టిప్ లపై పన్ను ఎత్తివేస్తామని గతంలోనే తాను హామీ ఇచ్చాననీ, తన హామీని ఆమె కాపీ కొట్టారని విమర్శించారు.
సర్వేల్లో కమలా హారిస్ ముందంజ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా న్యూయార్క్ టైమ్స్, సియానా కళాశాల సంయుక్తంగా విస్కాన్సిన్, పెన్సిల్వేనయా, మిషిగన్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా, నాలుగు పాయింట్ల ఆధిక్యతతో ట్రంప్ పై హారిస్ ముందంజలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ నెల 5 నుండి 9 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో మూడు రాష్ట్రాల్లో కమలా హారిస్ కు 50 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు వెల్లడైంది. ఈ రాష్ట్రాల్లో నాలుగు శాతం తక్కువగా ట్రంప్ కు 46 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లుగా తేలింది.