Sheikh Hasina: అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు

Ex Prime Minister of Bangladesh Sheikh Hasina sensational allegations against America

  • నిరసనలు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా
  • దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుండి వైదొలగానని వెల్లడి
  • సెయింట్ మార్జిన్ ద్వీపంపై సార్వభౌమత్వం, బంగాళాఖాతంలో పట్టుకు అమెరికా యత్నించిందన్న హసీనా

అగ్రరాజ్యం అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణ భయంలో దేశం విడిచిన హసీనా .. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన తిరుగు బాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ హసీనా ఈ ఆరోపణలు చేశారు.
 
ఆమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుండి వైదొలగానని పేర్కొన్నారు. వారు విద్యార్ధుల శవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని, దానిని తాను సహించలేదన్నారు. ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి .. అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్నని, దానికి ఇష్టపడకనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు. తాను బంగ్లాదేశ్ లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని, అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వైదొలిగినట్లు చెప్పారు.
 
దయచేసి అతివాదుల మాయలో పడొద్దని దేశ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని అన్నారు. తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని అన్నారు. చాలా మంది అవామీలీగ్ నాయకులు హత్యకు గురి కావడం ఆవేదన కల్గించిందన్నారు. తమ పార్టీ మరోసారి నిలదొక్కుకుంటుందన్న ఆశాభావాన్ని షేక్ హసీనా వ్యక్తం చేశారు.

More Telugu News