Budda Venkanna: అధికారం పోవడంతో జగన్ కు మతిభ్రమించింది: బుద్ధా వెంకన్న

TDP Senior Leader Budda Venkanna Fires On Former CM Jagan

  • మాజీ ముఖ్యమంత్రిపై టీడీపీ నేత తీవ్ర విమర్శలు
  • జగన్ హయాంలో అంబేద్కర్ రాజ్యాంగానికి అవమానం
  • అంబేద్కర్ విగ్రహాలకూ అప్పట్లో వైసీపీ రంగులు వేశారని ఫైర్

అధికారంలో ఉన్నపుడు ప్రజల సొమ్ముతో విర్రవీగిన జగన్ కు అధికారం దూరమైన రెండు నెలల్లోనే మతిభ్రమించినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని విమర్శించారు. సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించి, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారంటూ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.

విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి రూ. 404 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు చెప్పారని, అందులో రూ.226 కోట్లను జగన్ నొక్కేసారని ఆరోపించారు. చివరికి అంబేద్కర్ విగ్రహానికి కూడా వైసీపీ రంగులు వేసి ఆ మహానుభావుడిని అవమానించారని గుర్తుచేశారు. విగ్రహంపైన అంబేద్కర్ పేరు కంటే తన పేరునే పెద్దగా రాయించుకున్నారని ఫైర్ అయ్యారు. ఇది సహించలేక అంబేద్కర్ అభిమానులు జగన్ పేరును తొలగించి ఉండవచ్చని చెప్పారు. అంబేద్కర్‌ను జగన్ అడుగడుగునా అవమానించారని, దళితులపై దమనకాండకు పాల్పడిన వారిని కాపాడారని ఆరోపించారు.

మీలో మీరు కొట్టుకుని మాపై నిందలా?
రాష్ట్రంలో ఇటీవల జరిగిన గొడవలతో టీడీపీకి సంబంధం లేదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు వాళ్లలో వాళ్లు కొట్టుకుని చనిపోతే టీడీపీపై జగన్ నిందలు వేశారని ఆరోపించారు. జగన్ కు అసలు అంబేద్కర్ పేరును కూడా ఎత్తే అర్హత లేదన్నారు. దళితుల సంక్షేమం కోసం తెచ్చిన 27 సంక్షేమ పథకాలను నిలిపేసిన చరిత్ర జగన్ ది అని మండిపడ్డారు. దళితులపై అఘాయిత్యాలకు పాల్పడ్డ దోషులను ఎంతమందిని జగన్ తన పాలనలో పట్టుకున్నారో చెప్పాలని నిలదీశారు. డ్రైవర్ ను చంపి, మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చిన ఎమ్మెల్సీని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని బుద్ధా వెంకన్న గుర్తుచేశారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహం ఏర్పాటు చేసి తీరతామని చెప్పారు.

అభివృద్ధి ఎలా ఉంటుందో జగన్ కు చూపిస్తాం..
సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి ఎలా ఉంటుందో జగన్ కు చూపిస్తామని బుద్ధా వెంకన్న చెప్పారు. సంపద సృష్టి లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందో జగన్‌కు తెలియదన్నారు. రెచ్చగొట్టే ట్వీట్లు పెట్టి జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని, కులాల మధ్య చిచ్చు పెట్టి ఏపీకి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడని జగన్ పై విరుచుకుపడ్డారు. అయితే, చంద్రబాబు పాలనా దక్షత ముందు జగన్ ఆటలు సాగవన్నారు. ఇప్పుటికైనా రాష్ట్ర అభివృద్ధికి జగన్ సహకరించాలని, కాదని కుట్రలు చేస్తే ప్రజలే ఆయనను తరిమి కొడతారని బుద్దా వెంకన్న హితవు పలికారు.

  • Loading...

More Telugu News