Andhra Pradesh: విశాఖ విద్యార్థినికి అరుదైన గౌరవం.. ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం
- జయలిఖితకు యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆహ్వానం
- వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నయువజన, క్రీడల మంత్రిత్వశాఖ
- దేశ వ్యాప్తంగా 68 మందికి పిలుపు
విశాఖపట్టణానికి సాగర్ నగర్ ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థిని వడిసిల జయలిఖితకు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలో జరగనున్న 78వ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. యువజన, క్రీడల మంత్రిత్వశాఖ ప్రతి ఏటా ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రం విద్యార్ధులకు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం మైభారత్ పేరుతో పోర్టల్ ఏర్పాటు చేసింది. ఆయా కేటగిరీల విద్యార్ధులు దరఖాస్తు చేసుకుంటారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎన్‌వైకే విభాగంలో వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, 68 మందిని ఎంపిక చేసి ఆహ్వానాలు పంపింది.
సామాజిక సేవా కార్యక్రమాలు, విభిన్న అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, నెహ్రూ యువకేంద్రం నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జయలిఖితకు అవకాశాన్ని కల్పించింది. తనకు దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పట్ల జయ లిఖిత హర్షం వ్యక్తం చేసింది.