Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. 7 లక్షల మంది హాజరు!

Lakhs of Hindus took to the streets in Bangladesh on Saturday to protest against  attacks on the community

  • హిందూ కమ్యూనిటీపై దాడులకు నిరసనగా ఆందోళన
  • ఢాకా, చిట్టగాంగ్ నగరాల్లో భారీ ర్యాలీలు నిర్వహణ
  • సంఘీభావంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలు
  • మైనారిటీల దాడులు చేయవద్దని పిలుపునిచ్చిన తాత్కాలిక ప్రభుత్వ సారధి యూనస్

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చినా అక్కడి పరిస్థితులు చల్లారడం లేదు. మైనారిటీలైన తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ లక్షలాది మంది హిందువులు నిన్న (శనివారం) రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. రాజధాని ఢాకా, రెండవ ప్రధాన నగరమైన చిట్టగాంగ్‌లో భారీ నిరసనలు చేపట్టారు. ఈ ర్యాలీల్లో సుమారు 7 లక్షల మంది హిందువులు పాల్గొన్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి.

మైనారిటీలను వేధించిన వారిపై దర్యాప్తును వేగవంతం చేయాలని హిందువులు డిమాండ్ చేశారు. మైనారిటీలకు 10 శాతం పార్లమెంటు స్థానాలు కేటాయించాలని, మైనారిటీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. మైనారిటీల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో సహా వేలాది మంది ముస్లిం నిరసనకారులు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీతో ఢాకా నగరంలో 3 గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా అమెరికా, యూకేలలో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి.

కాగా షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో మైనారిటీ వర్గాలపై 205 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. ఎక్కువగా హిందువులపైనే దాడులు జరిగాయి. వందలాది మంది హిందువులపై, వారి ఇళ్లు, వ్యాపారాలపై కూడా దాడులు జరిగాయి. చాలామంది గాయపడ్డారు. ఇద్దరు హిందూ నాయకులు హింసకు బలయ్యారు. అంతేకాదు అనేక హిందూ దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు పొరుగున ఉన్న భారత్‌కు  పారిపోయి వచ్చారు. 

స్పందించిన మధ్యంతర ప్రభుత్వ సారధి..
దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారధి ముహమ్మద్ యూనస్ శనివారం ఖండించారు. ఈ దాడులను హేయమైన చర్యలుగా ఆయన అభివర్ణించారు. హిందూ, క్రిస్టియన్, బౌద్ధ కుటుంబాలను దాడుల నుంచి రక్షించాలంటూ నిరసనలు చేపడుతున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు. ‘‘వాళ్లు కూడా ఈ దేశ ప్రజలే కదా?. మీరు దేశాన్ని రక్షించగలిగారు. మరి కొన్ని కుటుంబాలను రక్షించలేరా?. వారు నా సోదరులు. ఎవరూ వారికి హాని చేయవద్దు. మనమంతా కలిసి పోరాడాం. కలిసి జీవిద్దాం’’ అని యూనస్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News