Preity Zinta: బంగ్లాదేశ్ హిందువులను కాపాడండి: ప్రీతి జింటా
- నిరసనకారుల ఆందోళనలతో రణరంగాన్ని తలపిస్తున్న బంగ్లా
- మైనారిటీలే లక్ష్యంగా దాడులు
- బంగ్లాదేశ్‌లో అల్లర్లపై 'ఎక్స్' వేదికగా నటి ప్రీతి జింటా ఆవేదన
నిరసనకారుల ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ రణరంగాన్ని తలపిస్తోంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయినా ఆందోళనలు ఆగడం లేదు. మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాలో అల్లర్లపై నటి ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి మైనారిటీలపై జరుగుతున్న దాడిని చూసి గుండె పగిలిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
"జనాన్ని చంపుతున్నారు. మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ హింస ఆగేలా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. దేశ ప్రజలను కాపాడుతుందని అనుకుంటున్నా. కష్టాల్లో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నా" అని ప్రీతి జింటా ట్వీట్ చేశారు. దీనికి #సేవ్‌బంగ్లాదేశీహిందూస్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.