APSRTC: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు తేదీపై మంత్రి స్పందన

Free Journey To AP Women In RTC Buses Announce Soon

  • ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమీక్ష
  • 15న వంద అన్న క్యాంటీన్ల ప్రారంభం
  • ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభ తేదీ మరో రోజుకు వాయిదా వేసే అవకాశం
  • ఉచిత బస్సు ప్రయాణంపై 12న అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
  • ఆ తర్వాతే కొత్త తేదీపై స్పష్టత

ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు సదుపాయం కోసం మహిళలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించే అంశంపై ఇప్పటికే అధికారుల బృందం ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలో అధ్యయనం చేసి వచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారని వార్తలు వినబడుతున్నాయి.

 అయితే అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. దీంతో మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవానికి మరో రోజు నిర్ణయిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అర్టీసీ, రవాణా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళల ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. కానీ, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. 12న మరోసారి ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరుగుతుందని, ఇందులో సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన అధికారులతో చర్చిస్తారని మంత్రి తెలిపారు. మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో 12వ తేదీ జరిగే సమీక్షపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఆ రోజునే మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలు తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు, గత ప్రభుత్వ  తీరుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. కారుణ్య నియామకాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపిన ఆయన .. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామని వెల్లడించారు. ఆర్టీసీలో ఏడువేల మంది సిబ్బంది కొరత ఉందని ఈ సందర్భంగా వెల్లడించిన మంత్రి .. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News