Iraq: ఇరాక్‌లో అమ్మాయిల పెళ్లి వయసు తొమ్మిదేళ్లే.. పార్లమెంటులో వివాదాస్పద బిల్లు

Iraq Proposes Law To Reduce Legal Age Of Marriage For Girls To 9

  • ఇప్పటి వరకు 18 ఏళ్లుగా ఉన్న వివాహ వయసు
  • అమ్మాయిలకు 9, అబ్బాయిలకు 15 ఏళ్లు కుదించేలా ప్రతిపాదన
  • ఆమోదం పొందితే బాల్య వివాహాలు పెరుగుతాయన్న ఆందోళన
  • ఇప్పటి వరకు సాధించిన పురోగతి బూడిదలో పోసిన పన్నీరవుతుందంటూ విమర్శలు
  • గతంలోనే ఇలాంటి ప్రయత్నమే చేసి వెనక్కి తగ్గిన ఇరాక్

సాధారణంగా ఏ దేశంలోనైనా అమ్మాయి పెళ్లి వయసు 18 ఏళ్లకు అటూ ఇటుగా ఉంటుంది. ఇరాక్‌లోనూ ఇప్పటి వరకు అలాగే ఉంది. అయితే, తాజాగా అక్కడి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమ్మాయిల వివాహ వయసును 9 ఏళ్లకు కుదించాలని అందులో ప్రతిపాదించడమే దీనికి కారణం. పర్సనల్ స్టేట్ లాను సవరించే ఉద్దేశంతో ఇరాక్ న్యాయ మంత్రిత్వశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టింది.

ఈ బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిలకు 9 ఏళ్లు, అబ్బాయిలకు 15 ఏళ్లు వస్తే వివాహాలకు సిద్ధమైపోతారు. ఈ విషయంలో వారికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస పెచ్చుమీరుతాయని, చదువు ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. అయితే, ఇప్పుడేమవుతుందోనన్న ఉత్కంఠ మాత్రం నెలకొంది.

  • Loading...

More Telugu News