India: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం... ఈసారి హాకీలో!

India hockey team wins bronze in Paris Olympics

  • నేడు మూడో స్థానం కోసం పోరులో భారత్ ఘనవిజయం
  • స్పెయిన్ పై 2-1 తేడాతో నెగ్గిన భారత జట్టు
  • కాంస్య పతకం కైవసం
  • భారత్ ఖాతాలో నాలుగో పతకం

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు నాలుగో పతకం లభించింది. భారత పురుషుల హాకీ జట్టు నేడు కాంస్యం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో భారత్ 2-1 తేడాతో స్పెయిన్ ను ఓడించింది. 

సూపర్ ఫామ్ లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ తో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ 18వ నిమిషంలో మార్క్ మిరాలెస్ చేసిన గోల్ తో స్పెయిన్ బోణీ కొట్టింది. అయితే, హర్మన్ ప్రీత్ 30, 33వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసి భారత్ ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇక, సెకండ్ హాఫ్ లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. 

మొత్తమ్మీద భారత్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడి పారిస్ ఒలింపిక్స్ లో మూడో స్థానంలో నిలవడం ద్వారా కాంస్యం కైవసం చేసుకుంది. కాగా, భారత హాకీ జట్టు గోల్ కీపర్ శ్రీజేశ్ కు ఇదే చివరి మ్యాచ్. శ్రీజేశ్ తన అంతర్జాతీయ కెరీర్ కు ఈ మ్యాచ్ తో రిటైర్మెంట్ ప్రకటించాడు.

నాలుగుకు పెరిగిన భారత్ పతకాల సంఖ్య

కాగా, తాజాగా హాకీలో సాధించిన కాంస్యంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన పతకాల సంఖ్య 4కి పెరిగింది. ఈ నాలుగు పతకాలు కాంస్యాలే. 

అంతకుముందు, మూడు పతకాలు షూటింగ్ లో వచ్చాయి. 10 మీటర్ల మహిళల వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ లో మను భాకర్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో మనుభాకర్, సరభ్ జోత్ సింగ్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్ లో స్వప్నిల్ కుశాలే కాంస్యాలు సాధించారు. 

  • Loading...

More Telugu News