Ganta Srinivasa Rao: నాడు చంద్రబాబును జగన్ హేళన చేశారు... ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?: గంటా
- ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమిదే విజయమన్న గంటా శ్రీనివాసరావు
- విశాఖ భూ కుంభకోణాలన్నీ వెలికి తీస్తామని వెల్లడి
- దోషులకు శిక్ష తప్పదని వ్యాఖ్యలు
- జగన్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని స్పష్టీకరణ
విశాఖపట్నంకు త్వరలోనే మెట్రో రైల్ వ్యవస్థ, ఫ్లై ఓవర్లు రానున్నాయని టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
వైజాగ్ ఫైల్స్ పై త్వరలోనే పూర్తి నివేదిక వస్తుందని, విశాఖ భూ కుంభకోణాలను బయటపెడతామని అన్నారు. అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. దోషులకు శిక్ష తప్పదని పేర్కొన్నారు. రుషికొండ భవనాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గంటా తెలిపారు.
"నిన్నటి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యుల విజయం రాబోయే అన్ని ఎన్నికల్లో మా విజయానికి నాంది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తాం.
గతంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ అవహేళన చేశారు. 23 మంది ఎమ్మెల్యేల్లో సగం మందిని లాగేసుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత పోదా అని జగన్ వ్యాఖ్యానించలేదా? ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? జగన్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే... విపక్ష నేత కాదు.
వైసీపీకి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు... అయినప్పటికీ వైసీపీకి మేం గౌరవం ఇస్తున్నాం. మేం గనుక గేట్లు తెరిచామంటే వైసీపీ ఖాళీ అవడం ఖాయం" అని గంటా వ్యాఖ్యానించారు.