Naga Chaitanya: నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం.. ధ్రువీకరించిన నాగార్జున!
- ఇవాళ ఉదయం నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించిన నాగార్జున
- ఆమెను మా కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామన్న నాగ్
- ఈ ప్రేమ, సంతోషం జీవితాంతం కొనసాగాలని నాగార్జున ఆకాంక్ష
అక్కినేని వారింట మరోసారి పెండ్లి బాజాలు మోగనున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్యకు తాజాగా నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆయన తండ్రి హీరో నాగార్జున ప్రకటించారు. గురువారం ఉదయం ఈ జంటకు నిశ్చితార్థం జరిగిందని ఆయన తెలిపారు. ఆమెను తమ కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామని నాగార్జున అన్నారు.
అలాగే ఈ ప్రేమ, సంతోషం జీవితాంతం కొనసాగాలని నాగార్జున ఆకాంక్షించారు. 8.8.8.. హద్దులేని ప్రేమకు నాంది ఈ రోజు అని అన్నారు. ఈ హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వీరి నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, 2017లో నటి సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు.
ఆ తర్వాత కొంతకాలానికి చైతూ-శోభిత జంటపై పుకార్లు మొదలయ్యాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, సహజీవనం చేస్తున్నారనీ కూడా చాలా రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం చేసుకోడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఎవరీ శోభితా ధూళిపాళ్ల..!
శోభిత ఏపీలోని తెనాలికి చెందిన అమ్మాయి. 1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు తెనాలిలో శోభిత జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. వైజాగ్ లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. ముంబై యూనివర్సిటీ, హెచ్‌ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తిచేసింది.
2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత 2016లో 'రామన్ రాఘవన్' అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ముఖ్యంగా 'పొన్నియిన్ సెల్వన్', 'మేజర్' సినిమల్లో సూపర్ పెర్ఫామెన్స్తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ లోనూ ఇటీవలే ఆమె అడుగుపెట్టింది. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకున్నారు.