Katerina Siniakova-Tomas Machak: ప్రేమికులుగా విడిపోయినా.. దేశం కోసం జంటగా పతకం గెలిచారు!

Czech duo Siniakova and Machak wins gold in Paris Olympics Tennis mixed doubles event

  • పారిస్ ఒలింపిక్స్ లో టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ స్వర్ణం గెలిచిన చెక్ రిపబ్లిక్
  • ఫైనల్లో అద్భుతంగా ఆడిన చెక్ జోడీ సినియకోవా-టోమాస్ మచాక్
  • గతంలో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్
  • ఆ తర్వాత విడిపోయిన టెన్నిస్ జంట

పారిస్ ఒలింపిక్స్ టెన్నిస్ క్రీడాంశంలో మిక్స్ డ్ డబుల్స్ స్వర్ణ పతకాన్ని చెక్ రిపబ్లిక్ కు చెందిన కాటెరినా సినియాకోవా, టోమాస్ మచాక్ జోడీ గెలుచుకుంది. అయితే, వీళ్ల విజయం పట్ల సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు. ఇందులో ప్రేమ కోణం ఉండడమే అసలు  విషయం. 

వివరాల్లోకెళితే... సినియాకోవా, టోమాస్ మచాక్ గతంలో ప్రేమికులు. టెన్నిస్ ఆట ఇద్దరినీ కలిపింది. ఒకే దేశం కావడంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించగా, అభిమానులకు నిరాశ కలిగిస్తూ... ఇద్దరూ విడిపోయారు. వారి మధ్య రిలేషన్ షిప్ కు అంతటితో తెరపడింది. 

కానీ, పారిస్ ఒలింపిక్స్ పుణ్యమా అని ఇద్దరూ మళ్లీ జట్టు కట్టారు. అయితే ప్రేమ కోసం కాదు... దేశం కోసం. వ్యక్తిగత జీవితంలోని విభేదాలన్నీ పక్కనబెట్టి కష్టపడి ఆడి తమ దేశానికి స్వర్ణం అందించారు. 

మీడియా సమావేశంలో కొందరు రిపోర్టర్లు సినియకోవా-టోమాస్ మచాక్ లను వారి లవ్ లైఫ్ గురించి ప్రశ్నించారు. మీ మధ్య ప్రేమ బంధం తెగిపోయిందన్నారు... కానీ ఇద్దరూ ఎంతో సమన్వయంతో ఆడి గోల్డ్ మెడల్ గెలిచారు... ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. 

అందుకు సినియకోవా స్పందిస్తూ... "మా వ్యక్తిగత జీవితం గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరంలేదు. అయినా మీరు ఇలా అయోమయానికి గురికావడం చూస్తుంటే భలేగా ఉంది" అని వ్యాఖ్యానించింది. టోమాస్ మచాక్ స్పందిస్తూ... "ఇది చాలా పెద్ద రహస్యం" అంటూ నవ్వేశాడు.

More Telugu News