KTR: పెట్టుబడుల పేరిట షెల్ కంపెనీలు... ఇవిగో ఫొటోలు: కేటీఆర్
- పెట్టుబడుల పేరిట స్కాంగ్రేస్ ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తోందంటూ విమర్శ
- సీఎం సోదరుడు ఇటీవల ప్రారంభించిన స్వచ్ఛ బయో కంపెనీతో మోసం చేస్తున్నారని మండిపాటు
- షెల్ కంపెనీలను వెలుగులోకి తెచ్చావంటూ క్రిశాంక్‌కు ప్రశంస
తెలంగాణకు పెట్టుబడుల పేరుతో స్కాంగ్రేస్ (కాంగ్రెస్) పార్టీ ఎత్తుగడలు వేస్తూ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం దావోస్‌లో 'గోడీ', ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో సీఎం సోదరుడు నెల రోజుల క్రితం ప్రారంభించిన 'స్వచ్ఛ బయో కంపెనీ' ఇదే కోవలోనివి అని ఆరోపించారు. ఇది (కాంగ్రెస్ మోసం) ఆరంభం మాత్రమేనని... ఇలాంటివి మరెన్నో చూస్తామని పేర్కొన్నారు. షెల్ కంపెనీలను వెలుగులోకి తెచ్చావంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశంసించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెడతానన్న స్వచ్ఛ బయోపై క్రిశాంక్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎంవోయూలో సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న వ్యక్తి హర్ష పసునూరి అని పేర్కొన్నారు. ఇతను అనుముల జగదీశ్వర్ బినామీ అని ఆరోపించారు.
స్వచ్ఛ బయోను పదిహేను రోజుల క్రితం రేవంత్ రెడ్డి సోదరుడు ప్రారంభించినట్లు తెలిపారు. రూ.1000 కోట్ల పెట్టుబడుల ప్రకటన మోసమని... ఇదంతా కుటుంబ వ్యాపారమని ఆరోపించారు. హర్ష, జగదీశ్, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన చిత్రాలను క్రిశాంక్ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు.